Karinagar: ‘కరీంనగర్’ను ‘కరినగర్’గా మార్చేసిన బీజేపీ.. దీని వెనుకో ఆసక్తికర చర్చ నడుస్తోందండోయ్..
ABN , First Publish Date - 2022-12-15T16:01:40+05:30 IST
ఛలో కరినగర్’ అని తెలుగు దిన పత్రికల్లో తెలంగాణ బీజేపీ ప్రకటన ఇచ్చింది. ఆంగ్ల దిన పత్రికల్లో కూడా ‘Chalo Karinagar’ అని ప్రకటన ఇచ్చింది. పొరపాటున ముద్రించి ఉండొచ్చని చాలా మంది పొరబడ్డారు. కానీ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరవుతుండడంతో ఈ బహిరంగ సభ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ జరిగే సమయంలో ఏర్పాట్లు, హడావుడి షరా మామూలే కద. ఇందులో.. అంత ఆసక్తి ఏముందని అనుకుంటారేమో. కానీ.. ఈ బహిరంగ సభకు సంబంధించి దిన పత్రికల్లో ఇచ్చిన ప్రచార ప్రకటనలతో తెలంగాణ బీజేపీ ఆసక్తికర చర్చకు తెరలేపింది. తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న జిల్లాల్లో ‘కరీంనగర్’ ఒకటి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కూడా ఇదే. తెలంగాణ ప్రాంతం నిజాంలు పాలించిన గడ్డ కావడంతో జిల్లాల పేర్లన్నీ దాదాపు ముస్లిం పేర్లను ప్రతిబింబించే విధంగానే ఉన్నాయి. ‘కరీంనగర్’ కూడా ఆ కోవకు చెందిన పేరే. తెలంగాణలో అధికారంలోకి వస్తే హైదరాబాద్‌తో సహా నిజాం ఛాయలున్న పేర్లన్నీ మార్చుతామని పలుమార్లు ప్రకటన చేసిన బీజేపీ తాజాగా ఈ బహిరంగ సభ ప్రకటనల్లో అదే చేసి చూపించింది. ‘ఛలో కరినగర్’ అని తెలుగు దిన పత్రికల్లో తెలంగాణ బీజేపీ ప్రకటన ఇచ్చింది. ఆంగ్ల దిన పత్రికల్లో కూడా ‘Chalo Karinagar’ అని ప్రకటన ఇచ్చింది. ఈ రెండు ప్రకటనలు చూసిన వాళ్లలో చాలామంది.. ఆ ప్రకటనల్లో ‘కరీంనగర్’ బదులు ‘కరినగర్’ అని, ఇంగ్లీష్‌లో కూడా ‘Karimnagar’ బదులు ‘Karinagar’ అని పొరపాటున ముద్రించి ఉండొచ్చని పొరబడ్డారు.
కానీ.. బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ పేర్ల మార్పుకు పూనుకుందని ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ‘కరినగర్’ పేరు కొందరికి కొత్తగా అనిపించొచ్చు గానీ ఆ జిల్లాకు చెందిన నిరక్షరాస్యులైన వృద్ధుల్లో చాలామంది ‘కరినగరం’ అని ఎప్పటి నుంచో వాడుకలో వినియోగిస్తుండేవారు. ఉదాహరణకు.. ‘కరినగరం పోతున్నా’ అని కరీంనగర్ వెళ్లే సందర్భంలో ఆ జిల్లాలోని గ్రామాలకు చెందిన కొందరు వృద్ధులు ఇంట్లో వాళ్లతో అంటూ ఉండటం గమనించే ఉంటారు. ‘కరీంనగర్’లో ‘కరీం’ అనేది ముస్లిం పేరు కావడంతో ఇకపై ఇలా పిలవకూడదని తెలంగాణ బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం. ‘కరినగర్’ అని పిలిస్తే.. ‘కరి’ అనే పదానికి ఏనుగు అనే అర్థం వస్తుండటంతో ఎలాంటి సమస్య లేదని బీజేపీ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఇంగ్లీష్‌లో కూడా ‘Karimnagar’ అని కాకుండా.. ‘Karinagar’ అని వాడాలని తెలంగాణ బీజేపీ డిసైడ్ అయింది. ఇదిలా ఉండగా.. బీజేపీ పార్టీపరంగా ఇచ్చే ప్రకటనల్లో తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తెలంగాణ చరిత్రకు సంబంధించిన కొన్ని పుస్తకాల్లో కూడా కరీంనగర్ ప్రాంతంలో అప్పట్లో ఏనుగులు ఎక్కువగా సంచరించేవని.. అందువల్ల.. ‘కరి’ అంటే ఏనుగు కావడంతో ఈ ప్రాంతాన్ని ‘కరినగరం’ అని పిలిచేవారని ఉండటం గమనార్హం. తాము ‘కరినగర్’ అని సంబోధించడం వెనుక ఈ కారణం ఉందని తెలంగాణ బీజేపీ చెప్పుకొచ్చింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణకు వచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే.. హైదరాబాద్, కరీంనగర్ పేర్లను మార్చేస్తామని యోగి ఆ సందర్భంలో బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ కొలువుదీరాక కొన్ని పేర్లను ఇప్పటికే మార్చేశారు. Faizabad అనే పేరును Ayodhya అని, Allahabad పేరును Prayagraj అని యోగి సర్కార్ మార్పు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ అనే పేరును ‘భాగ్యనగర్’ అని మార్చాలని బీజేపీ ఇప్పటికే ఫిక్స్ అయింది. తెలంగాణలోని చాలా జిల్లాలు ముస్లిం పేర్లతోనే ఉంటాయి. మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలు ఆ కోవకే వస్తాయి. మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, నిజామాబాద్‌ను ఇందూరుగా కూడా మార్చే ఆలోచనలో బీజేపీ ఉండటం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే.. బీజేపీ దిన పత్రికల్లో ‘కరినగర్’ పేరుతో ఇచ్చిన ఈ ప్రకటన ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు తావిచ్చింది.