Home » Gulf News
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందన్న ప్రధాని.. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని లోక్‌సభకు వెల్లడించారు.
ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఆయన ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి యుద్ధం కంటే చర్చలే మార్గమని స్పష్టం చేశారు.
ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత నాలుగో వారానికి చేరింది. యుద్ధ భయాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 8.5 కోట్ల మంది ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆన్‌లైన్ వ్యాపారాలు, బ్యాంకింగ్ సేవలు, ఐటీ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా పునరుద్ధరించాలి.. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తాం.. అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం ఇచ్చారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ ఈ హెచ్చరిక జారీ చేశారు.
అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేసింది. ప్రపంచంలోనే మొదటిసారి అమెరికా ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాన్ని కూల్చామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా రక్షణ వర్గాలు కూడా ఈ విషయాన్ని పాక్షికంగా ధృవీకరించాయి.
అమెరికాకు సైనిక స్థావరాలు ఇవ్వొద్దని ప్రాంతీయ దేశాల్ని ఇరాన్ అభ్యర్థించింది. ఈ స్థావరాలే ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమంది. తమపై దాడులకు సహకరించే దేశాలను దాడుల్లో భాగస్వాములుగా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పొరుగు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇరాన్ విజ్ఞప్తి చేసింది.
ఇరాన్ అణ్వాయుధ కలలకు బ్రేక్ పడిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రకటించారు. యురేనియం శుద్ధి చేసే శక్తిని ఇరాన్ కోల్పోయిందన్న ఆయన, వ్యూహాత్మక దాడులతో ఇరాన్ సైనిక వ్యవస్థలు ధ్వంసం చేశామని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ఈ దాడులు అనివార్యమన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగానే ఖతార్, యూఏఈ, సౌదీలలోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త దాడులను ప్రారంభించింది. పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. తమ గగనతలాన్ని రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.