ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:10 AM
హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాపై ఇరాన్ పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం మార్గాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిపాదించారు. అదే 'మెడిటరేనియన్ పైప్‌లైన్' రీ-రూటింగ్ ప్లాన్.
ఆంధ్రజ్యోతి, మార్చి 31: పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ పట్టున్న హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. అదే 'మెడిటరేనియన్ పైప్‌లైన్' (Mediterranean Pipeline) రీ-రూటింగ్ ప్లాన్.

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు, సహజ వాయువును హోర్ముజ్ జలసంధి ద్వారా కాకుండా, భూభాగంపై ఇజ్రాయెల్ మీదుగా మధ్యధరా సముద్రానికి (Mediterranean Sea) చేర్చడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం వాటా ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఈ పైప్‌లైన్ ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ మార్గం ద్వారా యూరప్, పశ్చిమ దేశాలకు ఇంధన రవాణా సమయం, ఖర్చు తగ్గుతాయని అంచనా.
కాగా, యుద్ధ కారణంగా సముద్ర మార్గాల్లో చమురు నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భూగర్భ పైప్‌లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల భద్రత పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అరబ్ దేశాలు - ఇజ్రాయెల్ మధ్య ఆర్థిక అనుబంధం మరింత బలపడుతుందని నెతన్యాహు భావిస్తున్నారు. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధనం కోసం ప్రత్యామ్నాయాల వెతుకులాటలో ఉన్న యూరప్‌కు ఇది పెద్ద ఉపశమనం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు