Share News

తీవ్రంగా గాయపడ్డ ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:47 AM

ఇరాన్ సుప్రీం లీడర్ అత్యంత సన్నిహిత సలహాదారు కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఖరాజీ నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖరాజీ భార్య ప్రాణాలు కోల్పోయారు. ఖరాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

తీవ్రంగా గాయపడ్డ ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ
Iran Advisor Kamal Kharrazi Injured

టెహ్రాన్, ఏప్రిల్ 2: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి అధిపతి, సుప్రీం లీడర్‌కు అత్యంత సన్నిహిత సలహాదారైన కమల్ ఖరాజీ (Kamal Kharrazi) అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. టెహ్రాన్‌లోని కమల్ ఖరాజీ నివాసంపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఖరాజీ తీవ్రంగా గాయపడగా, దురదృష్టవశాత్తు ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా ధృవీకరించింది.

గాయపడిన ఖరాజీని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 1997 నుండి 2005 వరకు ఇరాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఖరాజీ, ప్రస్తుతం ఇరాన్ విదేశీ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగానే ఈ తాజా దాడి జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఖరాజీపై జరిగిన ఈ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ తన డ్రోన్, క్షిపణి దాడులను మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, అమెరికా - ఇజ్రాయెల్ వర్గాల నుంచి ఈ దాడికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.


ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:54 AM