ఇరాన్ చర్చలకు రాకపోతే మరింత వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది: ట్రంప్
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:30 AM
ఇరాన్ 'B1' బ్రిడ్జ్ దాడిపై స్పందించిన ట్రంప్.. దారికి రాకపోతే, మరిన్ని దాడులుంటాయని హెచ్చరించారు. ఈ దాడి శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తుందని.. ఇలాంటి చర్యలు ఇరానియన్ల ధైర్యాన్ని దెబ్బతీయలేవని ఇరాన్ తేల్చి చెప్పింది.
టెహ్రాన్, ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌లోని అల్బోర్జ్ ప్రాంతంలో గల అత్యంత ఎత్తైన 'B1' వంతెన లక్ష్యంగా అమెరికా - ఇజ్రాయెల్ దళాలు జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. 95 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో సామాన్య పౌరులు పెద్ద సంఖ్యలో బలయ్యారని తెలుస్తోంది.
ఉత్తర ఇరాన్‌లోని కరాజ్ నగరంలో ఉన్న ఈ B1 వంతెన.. ఆ దేశంలోని అత్యంత సంక్లిష్టమైన, ఎత్తైన నిర్మాణాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ వంతెనపై వరుసగా రెండుసార్లు క్షిపణి దాడులు జరిగాయి. మొదటి దాడి జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపడుతుండగా, రెండవ దాడి జరిగినట్లు సమాచారం. మరణించిన వారిలో స్థానిక గ్రామాల నివాసితులతో పాటు, ప్రకృతి దినోత్సవం (Nature Day) వేడుకల కోసం వంతెన సమీపంలో ఉన్న పర్యాటకులు కూడా ఉన్నారని సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 'ఇరాన్ లోని అతిపెద్ద వంతెన కూలిపోయింది, ఇరాన్ చర్చలకు రాకపోతే దేశం మరింత వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది' అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. 'పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తుంది. ఇలాంటి చర్యలు ఇరానియన్ల ధైర్యాన్ని దెబ్బతీయలేవు' అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు,
'నిర్మాణంలో ఉన్న వంతెనలు సహా.. పౌర నిర్మాణాలపై దాడులు చేయడం వల్ల ఇరానియన్లు లొంగిపోరు. ఇది కేవలం అయోమయంలో ఉన్న శత్రువు ఓటమిని, నైతిక పతనాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ప్రతి వంతెనను, ప్రతి భవనాన్ని అంతకంటే బలంగా తిరిగి నిర్మిస్తాం. కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ తిరిగిరాదు.. అది అమెరికా ప్రతిష్టకు కలిగిన నష్టం...' అని అత్యంత ఘాటుగా ఇరాన్ విదేశాంగమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
Read Latest Telangana News and National News