తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:39 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు స్పష్టం చేసింది. విద్యుత్ స్తంభాలు వద్ద, చెట్ల కింద నిలబడ వద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొంది. భారీ వర్షాలు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
కొనసాగుతున్న అల్పపీడనం
For More Weather News And Telugu News