కొనసాగుతున్న అల్పపీడనం
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:16 AM
అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడునుంది.
నేడు వాయుగుండంగా.. రేపటికి తీవ్ర వాయుగుండంగా..
రేపటి నుంచి కోస్తాలో పెరగనున్న వర్షాలు
ఉత్తరకోస్తాకు అతి భారీ నుంచి కుంభవృష్టి వానలు?
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
అనంత జిల్లాలో భారీ వర్షం.. మిద్దె కూలి వృద్ధురాలు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా బలపడునుంది. ఆ తర్వాత కూడా అదేదిశలో పయనిస్తూ మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి పశ్చిమ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. అనంతరం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువుగా వచ్చి బుధవారం ఉదయానికి కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య(శ్రీకాకుళం జిల్లా శివారున) తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు దక్షిణ ఒడిశా, కోస్తాంధ్రలో వర్షాలు పెరుగుతాయి. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుందా? లేదా? అనే అంశంపై పలు వాతావరణ మోడళ్ల మధ్య వ్యత్యాసం నెలకొంది. కాగా, సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
అనంతలో ఉద్యాన పంటలకు ప్రాణం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో పలు వంకలు, వాగులు పొంగిపొర్లాయి. చేలలో పెద్దఎత్తున నీరు చేరింది. యాడికి మండలం భోగాలకట్టలో మిద్దె కూలి వృద్ధురాలు అశ్వత్థమ్మ(80) మృతి చెందారు. కాగా, తీవ్ర వర్షాభావంతో ఎండు దశకు చేరుకున్న పంటలు.. తాజాగా కురిసిన వర్షానికి తేరుకున్నాయి. ప్రస్తుతం కంది, ఆముదం పంటలు పూత దశలో ఉన్నాయి. ఆలస్యంగానైనా వర్షం పడటంతో ఈ పంటలు తేరుకున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు. వేరుశనగ పంట ఇదివరకే పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి పశుగ్రాసంగా వేరుశనగ కట్టె ఉపయోగపడనుంది. చీనీ, అరటి, దానిమ్మ, మామిడి తోటలకు వర్షం ఊపిరి పోసింది. వర్షానికి వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేడి సెగల నుంచి ఉపశమనం పొందారు.
ఈ వార్తలనూ చదవండి..