Share News

పదే పదే కబ్జా

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:54 AM

మండలంలోని తామరం గ్రామంలో సుమారు ఇరవై ఎకరాల ప్రభుత్వ గెడ్డపోరంబోకు భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడడంలో రెవెన్యూ అధికారులు విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర కాలంలో మూడుసార్లు ఒకే వ్యక్తి కబ్జాకు పాల్పడడం.. అధికారులు మొక్కుబడిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిచేతులు దులుపుకుంటున్నారు. అంతేగాని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదు. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూ కబ్జాకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.

పదే పదే కబ్జా
తామరం 61/3 సర్వే నంబరులో ప్రభుత్వ గెడ్డపోరంబోకు భూమి

తామరంలో ఇరవై ఎకరాల ప్రభుత్వ గెడ్డపోరంబోకు భూమిపై టీడీపీ నేత కన్ను

పుష్కర కాలం క్రితం ఆక్రమణకు యత్నం... యంత్రాలతో చదును

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో స్పందించిన అధికారులు

వీఆర్వోపై సస్పెన్షన్‌ వేటు

మళ్లీ గత ఏడాది అదే భూమి ఆక్రమణ

జీడిమామిడి మొక్కలు పీకేసి హెచ్చరిక బోర్డుతో సరిపెట్టిన అధికారులు

ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి కబ్జా

మొక్కలు తొలగించి చేతులు దులుపుకున్న రెవెన్యూ అధికారులు

భూమి మార్కెట్‌ విలువ రూ.4 కోట్లు పైమాటే!

మాకవరపాలెం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని తామరం గ్రామంలో సుమారు ఇరవై ఎకరాల ప్రభుత్వ గెడ్డపోరంబోకు భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడడంలో రెవెన్యూ అధికారులు విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర కాలంలో మూడుసార్లు ఒకే వ్యక్తి కబ్జాకు పాల్పడడం.. అధికారులు మొక్కుబడిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిచేతులు దులుపుకుంటున్నారు. అంతేగాని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదు. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూ కబ్జాకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.

మాకవరపాలెం మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తున్నది. అంతకుముందు సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రైవేటు రంగంలో అల్యూమినియం కంపెనీ నిర్మాణం ప్రారంభం అయ్యింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో వివిధ రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భూములను కేటాయిస్తున్నది. ఇప్పటికే డోజ్కో కంపెనీ, ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు పనులు మొదలయ్యాయి. పలు కంపెనీల ప్రతినిధులు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం భూములను పరిశీలించడంతోపాటు తమకు ఎంతెంత భూమి అవసరమో ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు నాలుగున్నర వేల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటు కోసం ‘ల్యాండ్‌ బ్యాంకు’గా ప్రకటించింది. దీంతో మాకవరపాలెం మండలంలో భూముల విలువ గణనీయం పెరిగింది. ఇదే అదనుగా భావించి కొంతమంది రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులతో కుమ్మక్కై ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారు.

మూడుసార్లు కబ్జా...

మండలంలోని తామరం రెవెన్యూ పరిధిలో నర్సీపట్నం-తాళ్లపాలెం ప్రధాన రహదారికి సుమారు అర కిలోమీటరు దూరంలో 61/3 సర్వే నంబరులో 20 ఎకరాల గెడ్డపోరంబోకు భూమి ఉంది. 2013లో రాచపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ భూమిని కబ్జా చేసి ఎక్స్‌కవేటర్లతో చదును పనులు చేపట్టారు. కొండగెడ్డ గట్లు, దిబ్బలను సరిచేశారు. దీనిపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా స్పందించారు. గెడ్డపోరంబోకు భూమిలో ఒక ఎక్స్‌కవేటర్‌, రెండు వాటర్‌ ట్యాంకర్లు, మూడు ట్రాక్లరు వుండగా.. వీటిలో ఒక ట్రాక్టర్‌ను మాత్రమే పట్టుకొని మిగిలిన వాహనాలను వదిలేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించి స్థానిక వీఆర్‌వోను సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి ఈ భూమిని ఆక్రమించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి రావడంతో పుష్కర కాలం క్రితం కబ్జాకు పాల్పడిన నాయకుడే మరోసారి ఈ భూమిని అక్రమించడానికి ప్రయత్నించారు. గత ఏడాది జూలైలో జీడిమామిడి మొక్కలు నాటగా, ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ వెంకటరమణ, సిబ్బందితో వెళ్లి జీడిమామిడి మొక్కలను పీకివేయించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. తహశీల్దార్‌ వెంకటరమణ కొద్ది రోజుల క్రితం బదిలీ కావడంతో టీడీపీ నాయకుడు మరోసారి గెడ్డపోరంబోకు భూమి కబ్జాకు యత్నించారు. సుమారు పది రోజుల క్రితం హెచ్చరిక బోర్డులను తొలగించి, జీడిమామిడి మొక్కలు నాటారు. యథావిధిగా వారం క్రితం రెవెన్యూ అధికారులు వచ్చి గెడ్డపోరంబోకు భూమిలో జీడిమామిడి మొక్కలు పీకివేశారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయలేదు సరికదా.. కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.20 లక్షలు పలుకుతున్నది. ఈ ప్రకారం టీడీపీ నేత ఆక్రమణకు యత్నిస్తున్న భూమి విలువ సుమారు రూ.4 కోట్లు వుంటుంది. ప్రభుత్వం ల్యాండ్‌ బ్యాంకు కింద ప్రకటించిన 4,250 ఎకరాలకు ఏర్పాటు చేసే 100 అడుగుల రోడ్డు ఈ భూమి పక్కనుంచే వెళుతుండడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి తామరం రెవెన్యూ పరిధిలోని 61/3 సర్వే నంబరులో వున్న 20 ఎకరాల గెడ్డపోరంబోకు భూమికి రక్షణ కల్పించాలని, గతంలో మూడుసార్లు కబ్జాకు యత్నించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:54 AM