డిగ్రీ అర్హతతో UIICలో ఉద్యోగాలు.. జీతం రూ.1.56 లక్షల వరకు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 07:24 PM
డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) గుడ్‌న్యూస్ చెప్పింది. 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) మంచి అవకాశాన్ని ప్రకటించింది. సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 ఖాళీలను ఈ నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.1.56 లక్షల వరకు వేతనం అందుతుంది. పోస్టులు, అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలు ఇవి..
పోస్టుల వివరాలు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – జనరలిస్ట్: 200 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – హిందీ ఆఫీసర్: 25 పోస్టులు
మొత్తం ఖాళీలు: 225
విద్యార్హతలు
జనరలిస్ట్ పోస్టులకు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, డేటా సైన్స్ తదితర విభాగాల అభ్యర్థులు అర్హులు. జనరల్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
హిందీ ఆఫీసర్ పోస్టులకు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో హిందీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. మరోవైపు, ఇంగ్లిష్ మీడియంలో మాస్టర్స్ డిగ్రీ చేసి, హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చదివిన వారు కూడా అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు అవసరం.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.82,485 నుంచి రూ.1,56,745 వరకు వేతనం లభిస్తుంది. బేసిక్ పేతో పాటు ఎన్‌పీఎస్, గ్రాట్యూటీ, ఎల్‌టీఎస్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, వైద్య సదుపాయాలు వంటి ప్రయోజనాలు ఉంటాయి.
వయోపరిమితి
2026 జూన్ 30 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1996 జూన్ 30 నుంచి 2005 జూన్ 30 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్షలు, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. మొదట ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు: రూ.250
ఇతర అభ్యర్థులు: రూ.1,000
ఎలా దరఖాస్తు చేయాలి?
UIIC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి. అందులో ఇచ్చిన సూచనల ప్రకారం ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అవసరమైన వివరాలు నమోదు చేసి, సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. చివరగా నిర్ణయించిన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 28, 2026
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 22, 2026
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 30, 2026