రైతులకు గుడ్ న్యూస్.. మే 26న కేరళను తాకనున్న రుతుపవనాలు
ABN , Publish Date - May 16 , 2026 | 05:04 PM
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
విశాఖపట్నం, మే 16: దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సాధారణంగా మే 26 ప్రాంతంలో కేరళను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి నాలుగు రోజుల ముందుగానో లేదా నాలుగు రోజుల ఆలస్యంగానో కేరళలో ప్రవేశించే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇప్పటికే రుతుపవనాలు అండమాన్ ప్రాంతంలోకి ప్రవేశించగా, క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా రుతుపవనాలు విస్తరించే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక మరోవైపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తమిళనాడులో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని హెచ్చరించింది. అయితే అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం కూడా ఉందని అధికారులు సూచించారు.
పెరుగుతున్న ఎండలు, ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రైతులు మాత్రం నైరుతి రుతుపవనాల రాకపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వర్షాలు సాధారణంగా నమోదైతే ఖరీఫ్ సాగుకు ఊతమిస్తాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ తప్పనిసరి: మంత్రి కొల్లురవీంద్ర
పీఎం, సీఎం ఆదేశాలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక ఫోకస్: మంత్రి గొట్టిపాటి రవికుమార్