మండిపోతున్న ఎండలు.. 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..
ABN , Publish Date - Apr 27 , 2026 | 09:22 PM
నేడు (సోమవారం) మార్కాపురం జిల్లా కంభంలో 45.7°C డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 227 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. మే నెలలో ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు (సోమవారం) మార్కాపురం జిల్లా కంభంలో 45.7°C డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 227 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
మంగళవారం నాడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని ఆ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 5 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇక, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆయన తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు చెట్ల కింద నిలపడవద్దని హెచ్చరించారు. వడగాలులతో ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని.. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని సూచించారు. గుండె, షుగర్, బీపీ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దాహం లేకపోయినా తరచూ మంచినీళ్లు తాగాలని సూచించారు.
బయటకు వెళ్లేటప్పుడు సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలని.. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలతో ఉక్కపోత తీవ్రంగా ఉందన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏయూ అంటే పేరు కాదు.. వందేళ్ల చరిత్ర: మంత్రి లోకేశ్..
కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. వాయిదా