రెయిన్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 08:42 PM
ఆంధ్రప్రదేశ్‌లో ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వర్షాలు, ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
తీవ్ర వడగాలులు..
శనివారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 14, అల్లూరి 1, పోలవరం 6, అనకాపల్లి 5, కాకినాడ 2, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అలాగే 79 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఆదివారం మొత్తంగా 93 మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని, దాని ప్రభావంతో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
జాగ్రత్తగా ఉండండి..
ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకి టోపి పెట్టుకోవాలని, తెలుపురంగు కాటన్ వస్త్రాలను ధరించాలని ఆయన సూచించారు. అదే విధంగా కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని చెప్పారు. నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
నేటి ఉష్ణోగ్రతలు..
శుక్రవారం నాడు కాకినాడ జిల్లా కరపలో 44.1°C, కడపలో 43.6°C, పశ్చిమ గోదావరి(జి) పోడూరులో 42.9°C, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 42.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. ఎన్టీఆర్(జి) మోగులూరులో 42.6°C, కృష్ణా(జి) పెదపారుపూడి, నంద్యాల(జి) బనగానపల్లిలో 42.3°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.1°Cలు నమోదైనట్లు వెల్లడించారు.
అలాగే విజయనగరం(జి) తుమ్మికపల్లిలో 42°C, కర్నూలు(జి) తోవిలో 41.5°C, అనంతపురం(జి) భట్టువానిపల్లి, మార్కాపురం(జి) పెద్దరావీడు, పల్నాడు(జి) అమరావతి, పోలవరం(జి) కూనవరంలో 41.4°C చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని చెప్పారు. పార్వతీపురం మన్యం(జి) భామినిలో 41.2°C, ప్రకాశం(జి) కొప్పెరపాడు, శ్రీసత్యసాయి(జి) తలుపులలో 41°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం!