కేసీఆర్, టి.జీవన్ రెడ్డి భేటీ.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 08:05 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వీరిద్దరూ దాదాపు ఐదు గంటలపాటు సమావేశం అయ్యారు.
సిద్దిపేట: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వీరిద్దరూ సమావేశం అయ్యారు. దాదాపు ఐదు గంటలపాటు వీరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. ఈ భేటీతో కారు పార్టీలో టి.జీవన్ రెడ్డి జాయిన్ కావడం లాంఛనమైంది. సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని జీవన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారని.. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోందని విమర్శించారు. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో తాను బీఆర్ఎస్‌లో చేరుతానని జీవన్ రెడ్డి చెప్పారు. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీ మీద వేస్తోందని మండిపడ్డారు. తనకు 14 సార్లు బి-ఫామ్ ఇచ్చారంటే అది తన సమర్థత వల్లేనని.. తాను కంటెంట్ ఉన్న నాయకుడిని కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలంటూ కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోందని.. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. మిగిలిన రెండున్నరేళ్లు అయినా కాంగ్రెస్ సర్కార్ బాగా పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
అగ్నిప్రమాదం.. గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్