ఏపీలో విస్తారంగా వర్షాలు.. ప్రజలకు కీలక సూచన
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:58 AM
దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నేడు, రేపు (ఆదివారం) రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్12: దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నేడు, రేపు (ఆదివారం) రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కి.మీ, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. అలాగే ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
నేడు శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. విజయనగరం, అల్లూరి మన్యం, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపధ్యంలో హైఅలర్ట్: హోం మంత్రి
దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం నేపథ్యంలో భారీ వర్షాలు కారణంగా హై అలర్ట్ ప్రకటించినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. నేడు, రేపు విస్తృతంగా వర్షాలు కారణంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె స్పష్టం చేశారు. అల్పపీడన పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. వర్షాలతో పాటు ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని ప్రజలకు స్పష్టం చేశారు. అలాగే సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హోం మంత్రి అనిత సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకలు ఢీ.. రంగంలోకి దిగిన తీర రక్షక దళం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1లో కొత్త సర్వీసులు
For More Weather News And Telugu News