Share News

తియ్యగుమ్మడి దప్పళం

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:24 AM

పెళ్లి పుస్తకం’ సినిమా కోసం ఆరుద్ర రాసిన ఈ పాటలో దప్పళం గొప్పదనాన్ని కీర్తిస్తాడు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, దప్పళం కలిపి తింటే అదే అసలైన విందట.

తియ్యగుమ్మడి దప్పళం
Vantalu

తియ్యగుమ్మడి దప్పళం

‘‘తియ్యగుమ్మడి దప్పళం ... పప్పు దప్పళం

అన్నం, నెయ్యి... వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచిన నెయ్యి,

పప్పు దప్పళం కలిపి కొట్టడం .. భోజనం కాదు, విందు భోజనం

వనభోజనం -- జనరంజకం!’’

‘పెళ్లి పుస్తకం’ సినిమా కోసం ఆరుద్ర రాసిన ఈ పాటలో దప్పళం గొప్పదనాన్ని కీర్తిస్తాడు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, దప్పళం కలిపి తింటే అదే అసలైన విందట. ఆరుద్ర తన రచనల్లో ఇలాంటి ఆహారప్రస్తావనలను తరచూ చమత్కారంగా ఉపయోగిస్తాడు. ‘‘నన్ను ముంచకపోతే నిన్ను ముంచుతానం టుందిట కందిసున్ని’’ అన్న మాటలోనూ అదే చమత్కారం కనిపిస్తుంది. కందిసున్నిని నెయ్యితో బాగా తడిపి తింటేనే ఆరోగ్యం అనీ, లేకపోతే అది పొట్టని చెరుస్తుందనీ భావం.


వడ్డన ఆలస్యమైతే దప్పళంలోని ముక్కలను పరామర్శించమంటాడు భరాగో. దప్పళంలో కూరగాయల ముక్కలు పెద్దవిగా ఉంటాయందుకేనని చమత్కరిస్తాడు. పులుసులో కూర గాయలను ఉదారంగా కలిపి నింపే ఈతీరును ఆయన ‘రెడ్‌ విత్‌’ అనే ఆంగ్ల పదబంధంతో ముడిపెట్టాడు. దానికి ‘మిశ్రమం’ లేదా ‘కలబోత’ అనే అర్థాన్ని ఆయనే ఇచ్చాడు.

దప్పళానికి దాదాపు ఏ కూరగాయైునా సరిపోతుంది. అయితే, తియ్యగుమ్మడి లేకపోతే ఆ వంటకు దప్పళం అనే నిండుదనం రాదు. తమిళుల కదంబంలో బూడిద గుమ్మడికి ప్రాధాన్యం ఉంటే, తెలుగువారి దప్పళంలో తియ్యగుమ్మడిదే మొదటి స్థానం.


తియ్యగుమ్మడి కేవలం రుచికరమైన కూర గాయ మాత్రమే కాదుఆరోగ్యానికి వర ప్రసాదం కూడా. బలకరం, శుభప్రదం. ‘అ’ నుండి ‘హ’ దాకా అంటే, అమీబియాసిస్‌ నుంచి హెపటైటిస్‌ వరకు అనేక వ్యాధుల్లో దీనిని ఆహారంగా తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది. కొన్నింటిలో అయితే ఇది తినితీరాల్సిన ఔషధ ద్రవ్యం కూడా!

క్యారెట్‌లో ఉన్నట్లే ఇందులోనూ విష పదార్థాల ప్రభావాన్ని తగ్గించే, బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక విలువలు కలిగిన ఈ గుమ్మడి కంటిచూపునకు, చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటంతో పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. చైనాలో మధుమేహ చికిత్సలోనూ గుమ్మడిని ఉపయోగిస్తున్నట్లు తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. షుగరు, స్థూలకాయం, రక్తపోటును నియంత్రించడంలో ఇది తోడ్పడుతుంది.


book7.2.jpgనల్లని కన్నయ్యను ఎర్రగుమ్మడితో పోలుస్తూ జానపద గేయాల్లో ‘‘గుమ్మడేడే...’’ అని ఆలపిస్తుంటారు. బూడిద గుమ్మడి, ఎర్రగుమ్మడి కాయలను నేడు దిష్టి తీయడానికి మాత్రమే ఉపయోగిస్తూ, అవి అద్భుతమైన కూరగాయలనే విషయాన్ని మరచిపోయాం.

గుమ్మడి గింజలను ఎండబెట్టి వేయించు కుంటే జీడిపప్పులా రుచిగా ఉంటాయి. గుమ్మడి గుజ్జు, గింజలు రెండూ మూత్ర పిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పురుషుల్లో జీవకణాల వృద్ధికి, లైంగిక సామర్థ్యానికి తోడ్పడతాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. పేగుపూతను తగ్గిస్తాయి. ముఖ్యంగా బద్దెపురుగు (టేప్‌వార్మ్‌) వంటి పేగు పరాన్నజీవులను నిర్మూలించడంలో గుమ్మడి గింజలు ఉపయోగకరమని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తోంది.


గుమ్మడి కొద్దిగా ఆలస్యంగా జీర్ణమవుతుంది. అందువల్ల చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఒక్క సారిగా రక్తంలోకి చేరకుండా కొంత ఆలస్యం చేస్తుంది. దప్పళం వండేటప్పుడు అల్లం, శొంఠి, మిరియాల పొడి వంటి దినుసులు చేరిస్తే రుచి పెరగడమే కాదు, అరుగుదల కూడా మెరుగుపడుతుంది.

అందుకే తియ్యగుమ్మడి దప్పళం మన సంప్రదాయ వంటల్లో రుచికి, ఆరోగ్యానికి ప్రతీకగా నిలిచింది.

  • డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Aug 02 , 2026 | 11:38 AM