వంటలు: ఉలవ పునుగుల కూర
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:32 AM
లైంగిక శక్తిని పెంచే వాటిని ‘వాజీకర’ ద్రవ్యాలంటారు. ‘వాజీ’ అంటే గుర్రం. అంతటి లైంగిక శక్తిని, ఆసక్తిని గుర్రానికీ మనుషులకు కూడా కలిగించేవి ఉలవలు.
లైంగిక శక్తిని పెంచే వాటిని ‘వాజీకర’ ద్రవ్యాలంటారు. ‘వాజీ’ అంటే గుర్రం. అంతటి లైంగిక శక్తిని, ఆసక్తిని గుర్రానికీ మనుషులకు కూడా కలిగించేవి ఉలవలు. హార్స్ గ్రామ్ అన్నారందుకే వాటిని... ‘హార్స్ పవర్’ పెంచుతాయని!
ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. ఏ రంగు ఉలవలు దొరికినా వండు కోవచ్చు. ఉలవలు శరీరానికి బలాన్నిస్తాయి. వాతవ్యాధుల్లో ఉపయోగపడతాయి, కఫాన్ని తగ్గిస్తాయి. కొద్దిగా వేడిచేసే స్వభావం కలిగి ఉంటాయి. గుండెకు బలాన్నిస్తాయి! అయితే ఉలవలు కాస్త కష్టంగా అరుగుతాయి. అందు వల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది.
మన ఇళ్లలో ఉలవచారు కాచుకోవడం సాధారణం. ఉడికించిన ఉలవలతో గుగ్గిళ్లు చేసుకుని తింటారు. పప్పుగా వండుకుంటారు. కందిపొడిలాగే ఉలవపొడి కూడా చేసుకుం టారు. అయితే నలమహారాజు ఉలవలతో పునుగులు చేసుకునే విధానాన్ని వివరించాడు. వాటిని వేడి అన్నంలో చామదుంపల వేపుడు కూరలాగా తినవచ్చన్నాడు. ఇలా తినటం రాజభోజనం అని కూడా వివరించాడు.
ఉలవ పునుగులు: ముందుగా ఉలవలను బాగా మెత్తబడే వరకు ఉడికించి, నీటిని వార్చి ఒకపక్కన ఉంచుకోవాలి. ఉడికించిన ఉలవలను ముద్దగా చేసి అందులో సైంధవలవణం, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చకర్పూరం వీటితో పాటు బూడిదగుమ్మడి వడియాలను నలిపిన ముక్కలు కూడా కలిపి, గోళీకాయలంత చిన్న ఉండలు కట్టాలి. వాటిని పునుగుల మాదిరిగా నేతిలోనో నూనెలోనో వేయించాలి.
మసాలా పునుగులు: ఒకవేళ ఉలవ పునుగుల్లో కారం మసాలా ఘాటు చాలదను కుంటే మసాలా పునుగుల్ని వేరే వండుకునే విధానాన్ని కూడా నలుడు వివరించాడు. శనగ పప్పు, మినప్పప్పు ఈ రెండింటినీ నానబెట్టి, వాటిలో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లం, ఇంగువ, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి మెత్తగా రుబ్బి ఆ పిండితో గోళీకాయలంత పునుగులు వేయించాలి. ఇవి ఘాటైన రుచి కలిగి ఉంటాయి.
ఈ రెండు రకాల పునుగుల్నీ చెరొకటీ తీసుకుని అన్నంలో నంజుకుంటూ తింటే మరింత రుచికరంగా ఉంటాయని నలుడు సూచించాడు. ఈ మిశ్రమం శరీరానికి, మనసుకు సుఖాన్నిస్తుందనీ, శుభప్రదం అనీ అన్నాడు. శుభకార్యాల సందర్భాల్లో వండుకో దగిన ప్రత్యేక వంటకం ఇది! ఒక విధంగా ఈ పునుగులు రెండింటి మిశ్రమాన్ని ఉలవ పునుగుల వేపుడుకూరగా చెప్పుకోవచ్చు. ఇది అన్ని దోషాలను హరించే వంటకం. అయితే ఉలవలు కష్టంగా అరుగుతాయని ఆయనకు తెలుసు. అందుకే బలమైన జీర్ణశక్తి లేనివారు జాగ్రత్తగా తినాలని హెచ్చరించాడు.
ఉలవచారు: ఉలవలను ఉడికించిన తరువాత వార్చిన రసంతో ఉలవచారు కాచుకోవచ్చునంటూ నలుడు ఆ రసంలో మిరియాల పొడి, ఇంగువ, తగినంత సైంధవలవణం, మనకు ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు కలిపి కొద్దిసేపు మరిగించమన్నాడు. ఉలవచారు పలుచగా ఉంటేనే రుచిగా ఉంటుందన్నాడు. ఈ ఉలవచారుతో పైన చెప్పిన ఉలవల పునుగుల కూరని నంజుకుంటే ఆ రుచే వేరు.
ఉలవలు శక్తిదాయకాలు. స్థూలకాయాన్ని తగ్గించేందుకు తోడ్పడే గొప్ప ఆయుధాలు. మంచి ప్రొటీన్ వనరు. పీచు పదార్థం ఎక్కువ. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది. మొలకలు కట్టించి తింటే కొన్ని పోషకాల లభ్యత పెరుగుతుంది. చలికాలంలో ఉలవ చారు, ఉలవ గుగ్గిళ్లు, ఉలవ పునుగుల్లాంటి వంటకాలు శరీరానికి వేడి, శక్తిని అందించే ఆహారంగా ఉపయోగపడతాయి.
డా. జి.వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...
ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి
Read Latest AP News And Telangana News And International News And Telugu News