వరంగల్ జిల్లాలో కొలిక్కి వచ్చిన చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
ABN , Publish Date - Feb 16 , 2026 | 09:08 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక లాంఛనం కానుంది. అలాగే ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మున్సిపాలిటీని దక్కించుకొంది.
వరంగల్, ఫిబ్రవరి16: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కొన్నింటిలో ఓటర్ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దాంతో పలు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. అలాంటి వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక లాంఛనం కానుంది. అలాగే ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మున్సిపాలిటీని దక్కించుకొంది. అదే విధంగా జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడనుంది.
జనగామలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. కానీ ఇరు పార్టీల ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 32 ఓట్లకు చేరాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చేరో16 మంది సభ్యులు ఉండటంతో హంగ్ ఏర్పడింది. తొర్రూరులో మొత్తం16 వార్డులు ఉండగా.. అందులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ పార్టీ 7 వార్డుల్లో విజయం సాధించింది. కానీ ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల సంఖ్య 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు సమానంగా వచ్చినట్లు అయింది. దాంతో హంగ్ ఏర్పడింది. అదీకాక.. తొర్రూరులో పలువురు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వార్డు సభ్యులు పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి వేళ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ వార్డు సభ్యులతో వీడియో విడుదల చేయడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ
గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..
For More TG News And Telugu News