Share News

అందరూ ఉన్నా అనాథలై, వడ్డీలు భారమై..దంపతుల ఆత్మహత్య

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:56 AM

ఇద్దరు కొడుకులున్న ఆ దంపతులు కష్టకాలంలో తమకు అండగా ఎవరూ లేరని కుంగిపోయారు. ఓ మహిళ వద్ద తీసుకున్న అప్పునకు వడ్డీలు చెల్లించలేక, ఆమె వేధింపులు భరించలేక, అనారోగ్య సమస్యలు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

అందరూ ఉన్నా అనాథలై, వడ్డీలు భారమై..దంపతుల ఆత్మహత్య
Warangal Couple Suicide

  • పెంపుడు కుక్క ప్రాణం తీసి ఆపై బలవన్మరణం

  • ఓ వడ్డీ వ్యాపారి వేధింపులు, అనారోగ్య సమస్యలతోనే నిర్ణయమంటూ లేఖ

  • అవయవాలను దానం చేయాలని ఆ లేఖలో సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి

  • వరంగల్‌ రంగశాయిపేటలో ఘటన

కరీమాబాద్‌ (వరంగల్‌), నవంబరు17 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు కొడుకులున్న ఆ దంపతులు కష్టకాలంలో తమకు అండగా ఎవరూ లేరని కుంగిపోయారు. ఓ మహిళ వద్ద తీసుకున్న అప్పునకు వడ్డీలు చెల్లించలేక, ఆమె వేధింపులు భరించలేక, అనారోగ్య సమస్యలు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తమతోపాటు తమ పెంపుడు శునకాన్ని కూడా చంపి తాము ఆత్మహత్య చేసుకున్నారు. మహిళా వడ్డీ వ్యాపారి వేధింపులు వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు. వరంగల్‌లో మంగళవారం వెలుగు చూసిన ఈ హృదయవిదారక ఘటనలో శాంతినగర్‌కు చెందిన నల్లపోగుల సంజయ్‌కుమార్‌(60), శోభ(53) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.


రంగశాయిపేటలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్న సంజయ్‌ కుమార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహితులైన వారిద్దరూ పుణెలో నివాసముంటున్నారు. సంజయ్‌ ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తుండగా, శోభ టైలరింగ్‌ పనిచేస్తోంది. మంగళవారం ఉదయం శోభ సోదరుడు టైలరింగ్‌ పని నిమిత్తం ఇంటికొచ్చి చూసేసరికి దంపతులిద్దరూ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నారు. పక్కనే వారి పెంపుడు శునకం విగతజీవిగా పడి ఉంది. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతులు రాసిన నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. అందరు ఉన్నా తాము అనాథలమని ఆర్థిక బాధలకు తోడు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని ఆ దంపతులు లేఖలో పేర్కొన్నారు. అలాగే, కుటుంబ అవసరాలకు దివ్య చంద్రిక అనే మహిళ వద్ద రూ.50 వేలు అప్పు చేశామని, రూ. 10వేలకు వారానికి రూ.750 చొప్పున ఆమె వడ్డీ వసూ లు చేస్తోందని తెలిపారు. ఇలా రూ.50వేలకు 11 నెలలుగా వడ్డీ చెల్లించామని, ఒక్క వారం చెల్లించకపోవడంతో ఆమె తీవ్రంగా అవమానించిందని వాపోయారు.


అయ్యా సీఎం గారూ...

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకంలో తనకు ఆపరేషన్‌ జరిగిందని, అదే విధంగా తనను తోబుట్టువుగా భావించి తమ అవవయవాలను దానం చేసి అంత్యక్రియలు జరిపించండి సార్‌.. అంటూ మృతులిద్దరూ సీఎం రేవంత్‌కు రాసిన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. మూగజీవితో పాటు తమ ఇద్దరి శవాలను ఎలక్ర్టిక్‌ యంత్రంలో వేసి దహనసంస్కారాలు చేయించాలని కోరారు. మమ్మల్ని ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చింది టైలర్‌ దివ్య చంద్రికే అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఇదిలా వుండగా, సంజయ్‌ దంపతులు ఆత్మహత్యకు ముందు తమ పెంపుడు శునకాన్ని ఎలా చంపారు ? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 05:56 AM