మహాజాతరకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:59 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటినుంచి జాతర జరగనుంది. దాదాను కోటిమందికి పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా. అయితే.. జాతర సమయంలో రద్దీ ఉంటుందనే భావనతో.. భక్తులు ముందుగానే దర్శించుకుంటున్నారు.
రేపటి నుంచే మేడారం సమ్మక్క-సారలమ్మ సంబురం
బుధవారం సాయంత్రం గద్దెపైకి సారలమ్మ
తరలివస్తున్న భక్తజనంతో చిక్కబడుతున్న పరిసరాలు
జాతర నిర్వహణకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు
ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక దృష్టి
శాంతిభద్రతలకు ఆధునిక టెక్నాలజీతో పోలీ్‌సశాఖ సిద్ధం
50 పడకల ఆస్పత్రితో పాటు 30 చోట్ల హెల్త్ క్యాంపులు
5,192 మంది మెడికల్, పారామెడికల్ సిబ్బంది నియామకం
20 లక్షల మందిని తరలించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు
5,700 మరుగుదొడ్లు, 5,500 తాత్కాలిక నల్లాలు
42,027 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బందికి విధులు
వరంగల్: మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు మహాజాతర ఘనంగా జరగనుంది. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 8 జోన్లు, 42 సెక్టర్లుగా జాతరను విభజించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 42,027 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మేడారంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జాతరలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఏఐ సహకారంతో అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలతో సన్నద్ధం అవుతున్నారు. అలాగే 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా జాతరకు చేర్చేందుకు ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖతో పాటు నీటిపారుదలశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదిరత శాఖలన్నీ కూడా సిద్ధమయ్యాయి. భక్తులకు సెల్ సిగ్నల్స్ సమస్య ఉత్పన్నం కాకుండా భారీగా మొబైల్స్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు.
పోలీసు శాఖే కీలకం
మేడారం జాతరలో అత్యంత కీలకమైనది పోలీస్ శాఖనే. ట్రాఫిక్‌తో పాటు శాంతిభద్రతల భారం ఆ శాఖపైనే ఉండటంతో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. జాతరలో 13వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు, ఎసీపీలు, డీసీపీలు, డీఎస్పీలు కూడా విధుల్లో చేరుతున్నారు. గత జాతరలో సుమారు 30వేల మంది భక్తులు తప్పి పోయిన నేపథ్యంలో ఈసారి జియోట్యాగ్ బెస్ట్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకవచ్చారు. వృద్ధులు, పిల్లలకు పస్రా, తాడ్వాయి మార్గాల్లో క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్‌లను కడుతారు. దీంతో ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్‌ను స్కాన్ చేస్తే వివరాలు తెలిసిపోతాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ప్రస్తుతం మేడారంలో అమలు చేస్తున్నారు. అలాగే శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని 12క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు.
అలాగే పాత నేరస్తులను గుర్తించేందుకు అస్పత్రి ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అపుమానస్పద వస్తువులను గుర్తించే రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు. అలాగే టీజీ క్వెస్ట్ అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను జాతరలో వినియోగిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఎవరు తప్పిపోకుండా, సురక్షిత జాతర లక్ష్యంగా ఏఐ డ్రోన్లు జాతరలో గస్తీ నిర్వహించనున్నాయి. అలాగే జాతరలో 450 సీసీ కెమెరాలు, 20 డిస్‌ప్లే ప్యానల్స్ వినియోగిస్తున్నారు. కౌడ్ కౌంటింగ్ కెమెరాలు, ఫెస్ రికగ్ననైజేషన్ కెమెరాలను కూడా క్యూలైన్‌లు, అఽధికంగా భక్తులు ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 42 పార్కింగ్ స్థలాలు, 37 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి పస్రా వరకు నాలుగు కిలో మీటర్లకు ఒకటి చొప్పున పోలీస్ ఔట్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే పస్రా నుంచి మేడారం వరకు రెండు కిలో మీటర్లకు ఒకటి చొప్పున పోలీస్ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే మొబైల్ పెట్రోలింగ్ టీమ్‌లు, మఫ్టీ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. 11 క్రేన్లు, 20 జేసీబీలను కూడా సిద్ధంగా ఉంచారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
వైద్యశాఖ సేవలు
మేడారం జాతరలో వైద్యశాఖ సేవలు కీలకంగా మారా యి.ఈసారి 50పడకల అస్పత్రితో పాటు ప్రత్యేకంగా 30 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 5,192మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు. జాతర సమయంలో 24గంటలు సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 649మంది వైద్యాధికారులు, 154మంది ఆయుష్ వైద్యాధికారులు, 673మంది నర్సింగ్ అధికారులు, 1,905మంది ఆశ వర్కర్లు, 1,111మంది పారా మెడికల్ సిబ్బంది, 331మంది సూపర్‌వైజరిస్టాఫ్, 700మం ది ఇతర సిబ్బదిని నియమించారు. జాతర అనంతరం కూ డా వ్యాధులు ప్రబలకుండా 10మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు ములు గు జిల్లా అస్పత్రి, ఏటూరునాగారం ఏరియా అస్పత్రిల్లో వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 108 వాహనాలను 15 అందుబాటులో ఉంచుతున్నారు. మరో 15 మొబై ల్ అంబులెన్స్‌లను కూడా జాతరకు తరలిస్తున్నారు.
ఆర్టీసీ ఏర్పాట్లు
మేడారం మహజాతరకు ఆర్టీసీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి 20 లక్షల మంది భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 4వేల ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసింది. 10,441 మంది సిబ్బందిని నియమించి సేవలను విస్తృత పరిచేందుకు ఏర్పాట్లు చేసింది. వరంగల్ రీజియన్‌లో 51 పాయింట్లను ఏర్పాటు చేసింది. హన్మకొండలో హయగ్రీవచారి మైదానం, వరంగల్‌లో పండ్ల మార్కెట్‌లో మేడారం బస్సు పాయింట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ వినూత్న తరహలో కొత్త స్కీం ప్రవేశ పెట్టింది. 30మంది భక్తులు ఉంటే ఇంటికే ఆర్టీసీ బస్సును పంపిస్తుంది. ఇప్పటికే మేడారం ప్రసాదాన్ని(బెల్లం) భక్తులకు ఇంటికి చేర్చేందుకు ప్రత్యేకంగా కార్గో సర్వీసు ప్రారంభించింది. అలాగే బస్సు సౌకర్యాలు, చార్జీలు, రూట్ మ్యాప్ తదితర వివరాల కోసం ప్రత్యేకంగా మేడారం విత్ ఆర్టీసీ పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది.
మరుగుదొడ్లు.. నల్లాలు..
మేడారంలో భక్తుల కోసం గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరఽథ ద్వారా రూ.13.70కోట్ల వ్యయంతో 57రకాల పనులను చేపట్టారు. జాతరలో 5,500 తాత్కాలిక నల్లాలు ఏర్పాటు చేశారు. వీటిలో 517 బ్యాటరీ ఆఫ్ టాప్స్, 47సిస్టెర్న్స్, 312 సిస్టర్స్ టాప్స్, 10 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. 2024లో 5,222 నల్లాలు ఏర్పాటు చేయగా, ఈసారి 5,500నల్లాలను ఏర్పాటు చేశారు. మేడారం ప్రధాన రహదారి, ఆలయం పరిసరా ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాలు, వివిధ గ్రామాల నుంచి వచ్చే రహదారులు, చెరువులు, జంపన్నవాగు సమీపంలో మరుగుదొడ్లతో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించారు. జాతరలో మొత్తం 5,700టాయిలెట్లు నిర్మించారు. 285 బ్లాకులుగా ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం శుభ్రం చేసేందుకు 255మంది సిబ్బందిని నియమించారు. అలాగే జాతరలో పారిశుద్ధం కార్యక్రమాల కోసం 5వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోజుకు మూడు షిప్టులుగా విభజించి 25సెక్టార్‌లలో పని చేయనున్నారు.
మరిన్ని సౌకర్యాలు...
జాతర సమాచారం కోసం తొలిసారి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 76589 12300 నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపితే రూట్ మ్యాప్, ట్రాఫిక్ తదితర పూర్తి వివరాలు అందుతాయి.
జాతరలో మొబైల్ నెట్ వర్క్‌కి అంతరాయం కలగకుండా 27శాశ్వత టవర్లు, 33తాత్కాలిక పద్దతిలో టవర్లు, 450వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు.
విద్యుత్ సమస్య తలెత్తకుండా 196ట్రాన్స్‌ఫార్మర్లు, 911విద్యుత్ స్థంబాలు, 65.75కి.మీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయగా, 350మంది విద్యుత్ సిబ్బందిని, 28డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు.
జంపన్నవాగు వద్ద భక్తులకు స్నాన ఘట్టాలు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు 119తాత్కాలిక గదులు, స్నానాలకు, తాగు నీటి కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ (బీవోటీ)లను ఏర్పాటు చేశారు.
జంపన్నవాగులోకి లక్నవరం నుంచి నీటిని వదలటంతో పాటు మూడు ఫీట్లకు మించి ప్రవాహం లేకుండా ఇసుక చదును చేశారు. 210మంది గజ ఈతగాళ్లు, 12సింగరేణి రెస్క్యూ బృందాలు, 10 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
15పైర్ బ్రిగేడ్ వాహనాలు, 268ఫైర్ ఫైటర్లను అందుబాటులో ఉంచారు.
జాతరలో మొత్తం 1,418ఎకరాల్లో 42 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు
మేడారం భక్తుల కోసం టూరిజం శాఖ హనుమకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సేవలను ప్రవేశ పెట్టింది. అలాగే జాతరలో జాయ్ రైడ్ కోసం కూడా ఏర్పాట్లు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News