తల్లుల సన్నిధిలో పులకింత..
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:48 AM
మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది. జాతర తేదీ దగ్గరపడుతున్నాకొద్దీ భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా.
మేడారానికి లక్షకు పైగా తరలివచ్చిన భక్తులు
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల చర్యలు
గద్దెల వద్ద సులభంగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు
తాడ్వాయి(ములుగు): మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. సుమారు లక్ష మందికి పైగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు రద్దీగా మారిపోయాయి. వాహనాలతో జాతర దారులు రద్దీగా మారాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించుకున్నారు. కాలినడకన గద్దెలకు చేరుకుని ఎత్తు బంగారం(బెల్లం), చీరె సారె పసుపు కుంకుమ పూలు పండ్లు కొబ్బరికాయలు బెల్లం తల్లుల గద్దెలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పార్కింగ్‌లకు మళ్ళిన వాహనాలు..
మేడారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వందల వాహనాల్లో పెద్దసంఖ్యలో భక్తులు మంగళవారం తరలివచ్చారు. వాహనాలు అధికంగా వస్తుండడంతో వాటిని పోలీసులు పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్ళించారు.

ప్రముఖుల రాక..
మహబుబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ తదితరులు వేర్వేరు సమయాల్లో వచ్చి తల్లుల గద్దెలకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహంచారు. చీరె సారె పూలు పండ్లు కొబ్బరికాయలు బెల్లం పసుపు కుంకుమ సమర్పించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు.
భారీ గేట్లు..
జాతరలో భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్‌శాఖ అధ్వర్యంలో రెండు వేలకు పైగా బారీ గేట్లను మేడారం తరలించారు. వీటిని జాతరలో రోడ్ల మళ్లింపు, వాహనాలను పార్కింగ్‌లకు పంపించే విధంగా ఉపయోగించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News