ఆపరేషన్.. ‘స్వచ్ఛ మేడారం’
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:29 AM
మేడారం మహాజాతర ముగిసింది. అయితే.. జాతరకు విచ్చేసిన వారు వదిలివెళ్లిన వ్యర్థాలతో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. దీంతో.. ఈ చెత్తను తొలగించేందుకు దాదాపు 5వేల మంది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నారు.
మహాజాతరతో కుప్పలు తెప్పలుగా చెత్త, చెదారం, వ్యర్థాలు
లక్షల మంది వదిలిన వ్యర్థాలతో ఆదివాసీల ఆరోగ్యానికి ముప్పు
చెత్తతో దారుణంగా మారిన మేడారం పరిసర ప్రాంతాలు
పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన 5 వేల మందికిపైగా సిబ్బంది
రోజుకు వెయ్యి టన్నులకు పైగా చెత్త, వ్యర్థాల తొలగింపు
ఓరుగల్లులోని స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఎస్ఎస్, ఎన్‌సీసీ కదలాల్సిన తరుణం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
మేడారం మహాజాతర ముగిసింది. లక్షలాది మంది భక్తులు తరలిరావటంతో మహాజాతర కిక్కిరిసిపోయింది. నెల రోజులుగా మహాజాతరకు వస్తున్న భక్తులు మేడారం(Medaram)లో బస చేసి... ఎన్నో వ్యర్థాలను, చెత్తను వదిలేశారు. జాతర ముగిసిపోగానే ఎక్కడి భక్తులు అక్కడికి సేఫ్‌గా చేరుకున్నారు. కానీ, మేడారంలో టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయింది. జంతువుల వ్యర్థాలు కంపుకొట్టే పరిస్థితి వచ్చింది. ఈసారి కోళ్లు భారీ ఎత్తున మృతిచెందాయి. వాటి వ్యర్థాలను తొలిగించటం సిబ్బందికి సవాల్‌గా మారింది. ఆదివాసీల ఊళ్లలో దుర్గంధం చేరకముందే శుభ్రం చేయాలనే లక్ష్యంతో సుమారు ఐదువేల మంది పారిశుధ్య కార్మికులు రంగంలోకి దిగారు. అలాగే ఓరుగల్లు యువత, విద్యార్థులు కూడా ముందుకు వస్తే స్వచ్ఛ మేడారం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టన్నులకొద్దీ చెత్త, వ్యర్థాలు
మేడారం మహాజాతరకు లక్షల మంది భక్తులు వచ్చా రు. నెల రోజులుగా మేడారం మహాజాతరకు భక్తుల రాక మొదలవ్వటంతో పరిసర ప్రాంతాల్లో భారీగా చెత్త, చెదా రం, జంతు వ్యర్థాలు పోగయ్యాయి. మేడారంతో పాటు కొంగల గట్టు, గుడ్డేలుగుల గుట్ట, గట్టు మైసమ్మగుడి, రెడ్డిగూడెం, కొత్తూరు, కన్నెపల్లి, నార్లాపూర్, ఊరట్టం తదితర ప్రాంతాల్లో భక్తులు బస చేశారు. రెండుమూడు రోజులు ఇక్కడే గుడారాలు, టెంట్‌లు వేసుకొని కుటుంబ సభ్యులతో భక్తులు బస చేశారు. వేలాది టన్నుల చెత్త, చెదారం, వ్య ర్థాలు పోగయ్యాయి. గత 2024 మహాజాతరలో సుమారు 3వేల టన్నుల చెత్తను గుర్తించగా, ఇందులో 1,021 టన్నులు ప్లాస్టిక్, 420 టన్నులకు పైగా జంతు వ్యర్థాలు పోగయినట్లుగా అధికారులు గుర్తించారు.
మరో 1,500 టన్నుల చెత్తలో భూమిలో తేలికగా కలిసిపోయే బియ్యం, బెల్లం, కొబ్బరి, ఆహార వ్యర్థాలు తదితరాలు ఉన్నాయి. 52 శాతం భూమిలో కలిసి పోయే చెత్త ఉండగా, ఇక భూమిలో తేలికగా కలిసి పోని గాజు, ప్లాస్టిక్ 48శాతం వరకు ఉంది. ఈసారి కూడా భారీగా చెత్త, చెదారం, వ్యర్థాలు పోగవ్వటంతో వాటిని తొలిగించే పనిలో సిబ్బంది ఉన్నారు. మహాజాతరలో పోగైన వ్యర్థాల్లో సుమారు 100టన్నులకు పైగా బాటిళ్ల వ్యర్థాలే ఉన్నట్లుగా సిబ్బంది గుర్తిస్తున్నారు. వీటిలో 50శాతం వరకు బాటిళ్లు రీసైక్లింగ్ అవుతుండగా, మిగతా 50శాతానికి పైగా బాటిళ్లు జాతర అవరణలో పగిలిపోయాయి.
పంట పొలాల్లో గాజు పెంకులు ఉండటం వలన పొలాల్లోకి వెళ్లే రైతులకు, కూలీలకు, పశువులకు గాయాలు అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పచ్చని అడవి భూమిలో కలిసిపోయిన ప్లాస్టిక్‌తో భవిష్యత్తులో భారీ నష్టాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. ఈసారి వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లు కుప్పలు కుప్పలుగా ఉండగా, వెంటనే వాటిని పూడ్చి వేస్తున్నారు.
స్వచ్ఛ మేడారం కోసం..
ప్రపంచవ్యాప్తంగా ఈసారి మేడారానికి గుర్తింపు లభించింది. విదేశీయులు కూడా భారీగా వచ్చారు. ట్రాఫిక్ జామ్‌తో భక్తులు ఇబ్బంది పడగా, మిగతా విషయాల్లో భక్తులు పెద్దగా ఇబ్బంది పడలేదని తెలుస్తోంది. మేడారానికి వచ్చిన అతిథులు భక్తులని, వారు విడిచి వెళ్లిన చెత్త, చెదారం, వ్యర్థాలను తొలగించాల్సిన బాఽధ్యత ఓరుగల్లు బిడ్డలపైనే ఉందని, ఒక్క పారిశుధ్య కార్మికులే కాకుండా ఓరుగల్లులో ఉన్న అన్ని కళాశాలల్లోని ఎన్‌సీసీ విద్యార్థులు, ఎన్‌సీసీ బృందాలు ముందుకు వచ్చి సేవలు అందించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కూడా ముందుకు వస్తే మేడారం స్వచ్ఛతగా మారుతుందని, ఆదివాసీల ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. జాతర సమయంలో వలంటీర్స్‌గా పని చేసేందుకు ఎన్నో సంఘాలు, సంస్థలు ముందుకు వచ్చాయి.
అదే తరహాలో స్వచ్ఛ మేడారం కోసం కదలిరావాలని ఆదివాసీలు కోరుతున్నారు. 2020లో మేడారం జాతరలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల స్వచ్ఛ భారత్‌ను నిర్వహించారు. మేడారం మహాజాతర సందర్భంగా పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలిగించి.. ఆదివాసీల ఆరోగ్యానికి బాసటగా నిలిచారు. సీఆర్‌పీఎఫ్ డి-39 బెటాలియన్, ఎఫ్-58 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌లోని జవాన్లు, అధికారులతో పాటు పస్రా, తాడ్వాయి పోలీసులు కూడా ఈ స్వచ్ఛత కార్యకమ్రంలో పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ సారి జవాన్లు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, ఉద్యోగులు ముందుకు రావాలని మేడారం భక్తులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News