ప్రచారానికి.. ‘పుర’మాయింపు..
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:29 AM
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో.. ఇక పోటీలో ఉన్న వారి జాబితా వెల్లడైంది. అలాగే పోటీలో ఉన్న వారంతా తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారానికి సిద్ధమయ్యాయి.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నేటి నుంచి పూర్తి స్థాయి ప్రచారంలోకి అభ్యర్థులు
మునిసిపాలిటీల్లో రాజకీయ సందడి
జనగామ: మునిసిపల్ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. ఎన్నికలలో కీలకమైన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మునిసిపల్ ఎన్నికలకు జనవరి 27న నగారా మోగగా 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. నామినేషన్ల స్వీకరణ గడువు 30వ తేదీతో ముగియగా 31న నామినేషన్ల పరిశీలన చేశారు. ఫిబ్రవరి 1న అప్పీళ్ల స్వీకరణ, 2న అప్పీళ్లపై పరిష్కారం చేపట్టారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ పూర్తి కావడంతో రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. పార్టీల అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు ఇతర గుర్తులు కేటాయించారు.
పూర్తి స్థాయి ప్రచారంలోకి..
నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇక పూర్తి స్థాయి ప్రచారం పర్వంలోకి వెళ్లనున్నాయి. పార్టీల అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు లాంఛనమే కావడంతో ముందస్తుగానే డోర్ స్టిక్కర్లు, వాల్‌పోస్టర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. కాగా, స్వతంత్రులకు మంగళవారం సాయంత్రం గుర్తులు ఖరారు కావడంతో ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
నామినేషన్లకు సంబంధించి తంతు పూర్తవడంతో బుధవారం నుంచి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించగా రేపటి నుంచి మరింతగా జనంలోకి వెళ్లనున్నారు. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాహనాల అనుమతులు, మైకుల అనుమతులు వంటివి తీసుకుంటున్నారు. మిగిలి ఉన్న రోజుల్లో ప్రచారంలో ఎలా దూసుకెళ్లాలన్న ప్రణాళికను అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News