మేడారానికి దారులు ఇలా...
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:25 PM
మేడారం మహాజాతర ఈనెల 28వతేదీ నుంచి ప్రారంభంకానుంది. 31వరకు జాతర జరగనుండగా... దాదాపు కోటిమందికిపైగా భక్తులు వచ్చేస్తారని అంచనా. అయితే.. జాతరకు విచ్చేసే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ర్యూట్ మ్యాప్‌ను రూపొందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లో ఈ నెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పోలీసులు ప్రత్యేక ర్యూట్ మ్యాప్‌ను రూపొందించారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, జనగామ, వరంగల్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు వరంగల్ మీదుగా ములుగు, పస్రా, వెంగళాపూర్, నార్లాపూర్ మీదుగా మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. వీరు తిరుగు ప్రయాణం నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఇక మహారాష్ట్ర, కాళేశ్వరం, భూపాలపల్లి, మంచిర్యాల, గోదావరిఖని, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు కమలాపూర్ క్రాస్ వద్ద నుంచి రాంపూర్, గొల్లబుద్ధారం, బయ్యక్కపేట, నార్లాపూర్ మీదుగా మేడారం సమీపంలోని ఊరట్టం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల వరకు చేరుకోవాలి. వీరు తిరిగి అదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కొత్తగూడెం, భద్రాచలం, చర్ల, ఖమ్మం నుంచి వచ్చే ప్రయాణికులు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాలకు అనుమతించనున్నారు. వీరు తిరిగి ఇదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఇక వీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు మేడారం వచ్చేందుకు తాడ్వాయి రూట్‌ను పోలీసులు ప్రత్యేకంగా కేటాయించారు. వీరు తిరిగి అదే దారిలో వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News