మేడారానికి పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:39 AM
వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క - సారలమ్మలను దర్శించుకోనున్నారు.
ములుగు, జనవరి 30: మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. మరో వైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నేడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. గురువారం అర్థరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్ఛేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి వాసంశెట్టి
For More TG News And Telugu News