Share News

స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి వాసంశెట్టి

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:03 AM

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి వాసంశెట్టి
AP Minister Vasamsetti Subhash

అమరావతి, జనవరి 30: తిరుమల వేంకన్న స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. అసెంబ్లీ స్థానాలు 151 నుంచి 11కు పడిపోయిన వైసీపీకి ఇదొక ఉదాహరణ అని ఆ పార్టీ నేతలకు ఆయన గుర్తుచేశారు. ఇకనైనా దేవుడితో ఆటలాపితే వాళ్లకే మంచిదంటూ హితవు పలికారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల కల్తీ లడ్డూపై సాక్షి ఛానల్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) ఇచ్చినట్టుగా వైసీపీ ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని ఆయన అభివర్ణించారు. తిరుమల శ్రీవారిపై వైఎస్ జగన్‌ అండ్ కో ఎందుకింత కక్షగట్టిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసిన సిట్ పూర్తి స్థాయి నివేదిక వస్తే.. వైసీపీ నేతలకు గుండెపోటులు వస్తాయని సుభాశ్ జోస్యం చెప్పారు. చేసిన మహా పాపాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలంతా చూస్తున్నారని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పదే పదే తిరుమల శ్రీవారినే టార్గెట్ చేయటానికి కారణాలేమిటంటూ వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. గతంలో వైఎస్ఆర్ సైతం ఏడుకొండలను ఐదు కొండలంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని గుర్తు చేశారు.


వైఎస్ జగన్‌కు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయానికి వెళ్లటం, ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో పాటు గుడికి వెళ్లకుండానే సెట్టింగులు వేసుకోవటం అలవాటుగా పెట్టుకున్నారంటూ వాసంశెట్టి మండిపడ్డారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మనుషులు.. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు పెట్టి అడ్డంగా దొరికారని విమర్శించారు. కల్తీ జరిగిందని సిట్ నివేదికలో నిర్ధారణ అయినా సంబరాలు చేసుకోవటానికి సిగ్గుందా? అంటూ వైసీపీ నేతల తీరును ఎండగట్టారాయన. దేశభక్తి లేదని ఎలాగూ తెలిసిందేనని.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అంటే ఎందుకంత కోపమో చెప్పాలంటూ మాజీ సీఎంను మంత్రి ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మేడారంలో కీలకఘట్టం ఆవిష్కృతం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

For More AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 12:18 PM