Share News

పదవులు ఇచ్చిన వారినే విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది: ఎర్రబెల్లి స్వర్ణ

ABN , Publish Date - Aug 20 , 2026 | 06:48 PM

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, సంప్రదాయం కాదని పేర్కొన్నారు.

పదవులు ఇచ్చిన వారినే విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది:  ఎర్రబెల్లి స్వర్ణ
Errabelli Swarna

హన్మకొండ, ఆగస్టు20: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, సంప్రదాయం కాదని పేర్కొన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసర్వాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. పెద్దలను గౌరవించడం, సభ్యతగా మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్షమించి వదిలేశామని గుర్తు చేశారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్షమించబోమని కుండ బద్దలుకొట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాలను మరిచి సీఎం రేవంత్‌పై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పదవులు ఇచ్చిన వారినే ఆ తర్వాత విమర్శించడం కొందరికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలకు ఇక అడ్డుకట్ట వేయాల్సి ఉందని స్పష్టం చేశారు.


సుస్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: మాజీ మేయర్

కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. అందరి మనోభావాలను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో బాగుపడిన వారు ఈ విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సంయమనం పాటించిందని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు.. తమ పిల్లలకు సభ్యత, సంస్కారం నేర్పాలని స్పష్టం చేశారు.

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి కొండా సురేఖ దంపతులకు పరోక్షంగా సూచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుండు సుధారాణి గుర్తు చేశారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కొండా సురేఖ కుమార్తెకు మాజీ మేయర్ హితవు పలికారు.


అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

కొండా సుస్మిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కొండా సుష్మితకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నాయకుల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోమని అన్నారు. కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులపై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.


వారిని పార్టీ భూస్థాపితం చేస్తుంది: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వెల్లడించారు. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించిన పార్టీ.. కాంగ్రెస్ అని గుర్తు చేశారు. క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించే వారిని పార్టీ భూస్థాపితం చేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

కుమార్తె వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మంత్రి కొండా సురేఖ

Read Latest TG News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 06:53 PM