Share News

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:55 PM

తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఆమె లేఖ రాశారు.

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ
TG Minister konda surekha

హైదరాబాద్, ఆగస్టు 20: తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఆమె లేఖ రాశారు. ఈ సందర్భంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ఆ లేఖలో మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె అయినంత మాత్రాన.. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సముచితం కాదని స్పష్టం చేశారు.


సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని కమిటీకి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా క్రమశిక్షణా కమిటీని మంత్రి కొండా సురేఖ కోరారు.


వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను ఆమె అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తాను బరిలో దిగుతానని ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకున్నా.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.


సుస్మిత వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని పీసీసీని కోరింది. అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి కూడా స్పందించారు. దీనిపై మంత్రి కొండా సురేఖను వివరణ కోరతామని అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.


ఇవి కూడా చదవండి..

ఏసీబీ వలలో ఎమ్మార్వో.. 15 బృందాలతో సోదాలు
ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబి సెలవు తేదీ మార్పు..

Read Latest TG News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 07:38 PM