ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని తండ్రి పన్నాగం
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:48 PM
కన్న కొడుకులను బిస్కెట్‌లో విషం కలిపి చంపాలని తండ్రి సుపారీ ఇవ్వడం కలకలం రేపింది. జనగామ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
జనగామ, ఏప్రిల్ 16: ఆస్తి కోసం కన్న బిడ్డలనే చంపాలనుకున్నాడు ఓ కసాయి తండ్రి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడితండా గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకులను బిస్కెట్‌లో విషం కలిపి చంపాలని తండ్రి సుపారీ ఇవ్వడం కలకలం రేపింది. 2016 సంవత్సరంలో బానోతు శ్రీనివాస్, అనితలు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీనివాస్ వేరే గ్రామానికి చెందిన మూడవత్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. 20 గుంటల భూమి కుమారుల పేరు మీద ఉండటాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు.
ఆస్తి సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ తన రెండవ భార్య మమతతో కలిసి పన్నాగం పన్నాడు. కుమారులకు బిస్కెట్‌లో విషం కలిపి ఇచ్చి చంపాలని నిర్ణయించి.. అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న వ్యక్తి భయపడి గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలిపాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్, రెండో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని జనగామ కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఆస్తి కోసం కన్న తండ్రే కొడుకులను చంపాలని యత్నించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి...
జనంలో ఉండాలి.. జనం కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆ విషయాల్లో మహిళల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And Telugu News