సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ప్రొఫెసర్.. కోటి స్వాహా
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:26 AM
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటి రూపాయలు పోగొట్టుకున్నారు వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్, మార్చి 27: వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్‌ను సైబర్ నేరగాళ్లు(Cyber Fraud) మోసం చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మోసం చేసి కోటి రూపాయలు కొట్టేశారు. ఈ ఘటన వరంగల్‌లో సంచలనం సృష్టించింది. బాధితుడు సుధాకర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం గూగుల్‌లో ఓ వెబ్‌సైట్‌ను సెర్చ్ చేశారు. ఆ సైట్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లింక్‌పై క్లిక్ చేసి వాట్సాప్ నంబర్‌ను ఇచ్చారు. ఆ నంబర్ ద్వారా నేరగాళ్లు బాధితుడిని ‘H_18’ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసి పూర్తిగా నమ్మించారు.
గ్రూప్‌లో కంపెనీ అకౌంట్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్న కిరణ్ అనే వ్యక్తిని సుధాకర్ పూర్తిగా నమ్మారు. జనవరి నుంచి ఇప్పటివరకు విడతల వారీగా నేరగాళ్ల ఖాతాలకు కోటి రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన సుధాకర్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్ల ఖాతాలు, వాట్సాప్ గ్రూప్, వెబ్‌సైట్ వివరాలు సేకరించి వారిని ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి...
సింహాచలం కొండ దిగువన గుర్తుతెలియని వ్యక్తుల ఘాతుకం
విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్
Read Latest Telangana News And Telugu News