రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:47 AM
మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన మరికొన్ని ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) చర్యలు చేపట్టింది.
అమరావతి, మార్చి 24: మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన మరికొన్ని ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) చర్యలు చేపట్టింది. వీటిని జప్తు చేయటానికి విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని సిట్ కోరింది. అందుకు అనుమతి ఇస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డికి చెందిన మరిన్ని ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసేందుకు మార్గం సుగమం అయినట్లు అయింది.
మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్‌లో అతడు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ కనుగొంది. వాటిలో కొన్నింటిని సిట్, ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక ముడుపుల సొత్తుతో తన తల్లిదండ్రుల పేరు మీద రాజ్ కసిరెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ తన దర్యాప్తులో సైతం గుర్తించింది. తెలంగాణలోని జనగామతో పాటు షాబాద్ ప్రాంతాల్లో దాదాపు రూ.70.36 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది.
2024, మే 10వ తేదీన రాజ్ కసిరెడ్డి తన తల్లి కసిరెడ్డి సుభాషిణి పేరిట షాబాద్‌లో రూ.17.60 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీని మార్కెట్ విలువ రూ.70 కోట్లు కాగా.. రిజిస్ట్రేషన్ విలువ రూ.2.69 కోట్లుగా చూపించారు. ఇక 2022, జూన్ 13వ తేదీన తండ్రి కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి పేరిట జనగామలో 265 చద రపు గజాల స్థలం.. అలాగే జూన్ 27న 764.64 చదరపు గజాల విస్తీర్ణంలోని మూడు ప్లాట్లు రాజ్ కసిరెడ్డి కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.
వీటి వాస్తవ విలువ రూ.36.03 లక్షలు కాగా.. రిజిస్ట్రేషన్ విలువ రూ.15.45 లక్షలుగా కసిరెడ్డి చూపినట్లు సిట్ తన దర్యాప్తులో గమనించింది. వీటన్నింటినీ జప్తు చేయటం కోసం విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయాలని సిట్ నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వ అనుమతి కోరగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. రాజ్ కెసిరెడ్డి, ఆయన కుటుంబీకులకు సంబంధించిన రూ. వందల కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే సిట్, ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వేసవిలో మజ్జిగను ఇలా చేసుకు తాగితే..
For More AP News And Telugu News