మేడారం పనుల్లో డొల్ల
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:07 AM
సమ్మక్క-సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో జాతరకు ముందు నిర్వహించిన ఆయా పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలొస్తున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్వహించిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో నెలరోజుల వ్యవధిలోనే అవి మరమ్మతులకు గురవడం పట్ల పలు విమర్శలొస్తున్నాయి.
గద్దెల ఆవరణలో ధ్వంసమైన రాతి నిర్మాణాలు
ములుగు: ములుగు జిల్లా మేడారంలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రూ. 101 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడింది. 200 ఏళ్లకు పైగా శాశ్వతంగా ఉండేలా నిర్మిస్తున్నామని చెప్పిన కట్టడాలు విరిగి పడుతున్నాయి. సమ్మక్క-సారలమ్మల గద్దెల చుట్టూ శిలలతో ఏర్పాటు చేసిన రేయిలింగ్ మహాజాతరకు వచ్చిన భక్తుల తాకిడికి ఊడి పడ్డాయి. 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలుస్తాయని అనుకుంటే నాలుగురోజులకే నిలవలేక పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మేడారం(Medaram)లో గద్దెల పునరుద్ధరణలో భాగంగా శాశ్వత అభివృద్ధి పనులకు అధికారులు జూలైలో మాస్టర్ ప్లాను రూపొందించారు. ఈ ప్రణాళికలతో పూజారుల సమక్షంలో సమావేశమై డిజైన్లను పరిశీలించారు. పూజారుల అభ్యంతరాలు, ఆధివాసీ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేశారు.. పూర్తి స్థాయిలో డిజైన్లను రూపొందించి వారి సమ్మతిని పొందారు. ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ఆధునికీకరణ, ప్రాకారం విస్తరణ, క్లౌడ్‌లైటింగ్, వాచ్ టవర్స్, 9 ఆర్చిగేట్లు, గద్దెల ఆవరణలో రాతి ఫ్లోరింగ్, సీసీ రోడ్లు, గార్డెనింగ్ తదిత నిర్మాణాలను చేపట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గత సంవత్సరం సెప్టెంబరు 23న శంకుస్థాపన చేశారు.
100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు ఆక్టోబరులో పనులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆల్లగడ్డ నుంచి రాతి శిలలపై శిల్పాలను చెక్కి మేడారం తీసుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. బేస్‌మెంట్ పనుల నుంచి రాతి నిర్మాణాల వరకు మహా జాతరకు ముందుగా 90 శాతం పనులను పూర్తి చేశారు. మహా జాతర సమీపించడంతో ఈ పనులను నిలిపివేసింది.
అయితే.. భక్తులు వనదేవతలను భారీ సంఖ్యలో దర్శించుకునేందుకు తరలి రావడంతో గద్దెల ఆవరణ కిక్కిరిసి పోయింది. ఈ తాకిడితో సమ్మక్క-సారలమ్మల గద్దెల చుట్టూ ఉన్న రాతి నిర్మాణాలు విరిగిపోయాయి. శిలలు పక్కకు పడిపోయాయి. ఇదిలా ఉండగా మహా జాతరలో ప్రధాన ఆర్చిగేటుపై భాగం కూడా వంగిపోయినట్టు మంత్రి సీతక్క గుర్తించారని తెలిసింది. కాంట్రాక్టర్లకు వెంటనే మంత్రి సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమై వంగిపోయి ఉన్న ఆర్చి గేటు పైభాగాన్ని సరిచేసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News