నైని బ్లాక్ వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: టీ బీజేపీ చీఫ్
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:20 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సింగరేణి అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది సమాన పాత్ర ఉందంటూ ఆయన విమర్శించారు.
ఢిల్లీ, జనవరి 20: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సింగరేణి అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది సమాన పాత్ర ఉందంటూ ఆయన విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ' సింగరేణిలోని నైని బ్లాక్ వివాదంపై సీబీఐ లేదంటే ఏదైనా సంస్థతో దర్యాప్తు జరపాలి. ఇది ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరిగిన గొడవల వలనే బయటకు వచ్చింది. మీడియాలో వచ్చిన తర్వాతే నైని బ్లాక్ టెండర్లు రద్దు చేశారు. అంతకు ముందు టెండర్లు ఎందుకు రద్దు చేయలేదో భట్టి బయట పెట్టాలి' అని ఆయన అన్నారు.
నైని బ్లాక్ వ్యవహారంలో పారదర్శకత లేదు:
రామచంద్రరావు మాట్లాడుతూ.. 'నైని బ్లాక్ వ్యవహారంలో పారదర్శకత లేదు. సింగరేణి అవినీతిలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. రాష్ట్రమంతా నైని కోల్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నారు. సింగరేణిలో ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా అధికంగా ఉంటుంది. ప్రస్తుతం సింగరేణి లాభాల్లో ఉంది. నైని కోల్ బ్లాక్ అంశంతో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య వివాదాలు బయటపడ్డాయి. మంత్రులు బంధువులకు కోల్ బ్లాక్ కేటాయించే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ సుద్ద పూసేమీ కాదు. నైని బ్లాక్‌లో ఎవరికి ఎంత ముట్టిందో చెప్పాలి. సింగరేణిలో కమిషన్ కింద కోట్లు సంపాదిస్తున్నారు' అని రామచంద్రరావు తెలిపారు.
మంత్రుల మధ్య తగాదాలు..
'కాంగ్రెస్ మంత్రుల మధ్య తగాదాలు అవుతున్నాయి. వారి వారి బంధువులకు కాంట్రాక్టులకు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌లో ఆస్తుల పంచాయతీ నడుస్తోంది. హరీష్ రావుకు ఒకటే చెప్తున్నా.. సుద్దపూస మాటలు మాట్లాడొద్దు. రాష్టానికి మొదట బ్రష్టు పట్టించింది బీఆర్ఎస్.. దాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. సింగరేణి ఉద్యోగులకు, ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. స్టేట్ గవర్నమెంట్‌లో సిట్, ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. వాటితో కూడా విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల అవినీతి, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై కూడా అవినీతి విచారణ జరగాలి' అని ఆయన డిమాండ్ చేశారు.
'కాళేశ్వరం మొత్తం రూ .లక్ష 30 వేల కోట్లు ఖర్చు చేశారు . కాళేశ్వరం ATM గా మారిందని మేము కూడా చెప్పాం. ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో చాలా మంది అధికారులను అరెస్ట్ చేసినా.. రాజకీయ నాయకులను మాత్రం అరెస్ట్ చేయలేదు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మాత్రమే చేస్తున్నారు. హరీష్ రావును సిట్ ఎందుకు పిలవలేదు. వారి ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని బీఆర్ఎస్ గతంలో జీవో తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఆ జీవోను ఇంకా ఎత్తివేయలేదు. ఈడీకి ఎలాంటి అనుమతి అవసరం లేదు.. వాళ్ళు విచారణ చేయొచ్చు' అని రామచంద్రరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి.. కారణమేంటో తెలుసా?
బీరు బాటిళ్లతో ఇలా ఎవరైనా చేస్తారా.. 282 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై..