క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కైవసం.. ఖానాపూర్ మాత్రం..
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:31 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన ఆ మూడు మున్సిపాలిటీల్లో రెండింటి లెక్క తేలింది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు..
హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మూడు మున్సిపాలిటీల్లో రెండింటి లెక్క తేలింది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఏం చేయాలో అవన్నీ చేశాయి. కొనుగోళ్లు, కిడ్నాప్‌లు, కేసులు, ధర్నాలు, నిరసనలతో రాజకీయాన్ని రక్తికట్టించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఫిబ్రవరిలోనే జరగాల్సిన ఈ 3 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక.. దాదాపు నెలన్నర తరువాత ఎట్టకేలకు నేడు(శనివారం) జరిగింది. ఈ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలను ప్రతిపక్ష బీఆర్ఎస్ కూటమి కైవసం చేసుకోగా.. ఖానాపూర్‌లో ఇంకా టెన్షన్ వాతావరణమే నెలకొంది.
క్యాతనపల్లి బీఆర్ఎస్-సీపీఐ కైవసం..
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం చేసుకుంది. చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గుడిసెల సంధ్యారాణిని ఎన్నుకోగా.. వైస్ చైర్ పర్సన్‌గా సీపీఐ అభ్యర్థి సరితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు సరిపడా బలం లేని కారణంగా చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది.
క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి 13 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక్కడ బీఆర్ఎస్-సీపీఐ లకు 14 మంది సభ్యుల బలం ఉంది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి కాంగ్రెస్‌కు 10 మంది మద్దతు ఉంది. దీంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది.
ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్-బీజేపీ కైవసం..
ఇబ్రహీంపట్నంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డిని ఎన్నుకోగా.. వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి శ్యామలను ఎన్నుకున్నారు.
ఖానాపూర్ ఎన్నిక వాయిదా..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ కూటమి - కాంగ్రెస్ మధ్య వివాదం నేపథ్యంలో ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి(ఆదివారం) వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
అధికారుల తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలం లేకున్నా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొజ్జుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఫైర్ అయ్యారు.
ఖానాపూర్ మున్సిపర్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. బీజేపీ చైర్ పర్సన్ అభ్యర్థి మౌనికకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు చేతులెత్తారు. అయితే, తమ అభ్యర్థి సత్యం కు మద్దతుగా కూడా ఏడుగురు కౌన్సిలర్లు చేతులెత్తినట్లు కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు. ఇరు వర్గాల ఆందోళనలతో అధికారులు ఎటూ తేల్చలేకపోయారు. ఉన్నతాధికారులతో సంప్రదింపుల అనంతరం ఎన్నికను రేపటికి(ఆదివారం) వాయిదా వేశారు.
తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు.. 116 మున్సిపాలిటీలకు గత ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరుగగా.. 13న ఫలితాలు వెల్లడించారు. ఫిబ్రవరి 16వ తేదీన అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వివాదాలు, సంఖ్యాబలం లేకపోవడం వంటి కారణాలతో మూడు మున్సిపాలిటీలకు మాత్రం ఎన్నిక నిర్వహించలేదు. దాదాపు నెలన్నర తరువాత క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలకు శనివారం నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు.
Also Read:
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ కింద పడి దంపతులు దుర్మరణం
ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ భూములు దోచుకుంటున్నారు: ఎంపీ ఈటల
ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...