పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ కింద పడి దంపతుల మృతి
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:16 PM
నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా వాహనదారులు వినిపించు కోవడం లేదు. ఏపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే..
సత్తెనపల్లి, ఏప్రిల్4: నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా.. వాహనదారులు వినిపించు కోవడం లేదు. ఏపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పి లారీ కిందపడటంతో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన అంజయ్య(63), కోటేశ్వరమ్మ(60) దంపతులు ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్ పై పిడుగురాళ్ల వైపు బయలుదేరారు. సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ వద్దకు చేరుకోగానే బైక్ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ సమయంలో పన్కనే వెళ్తున్న లారీ కిందకు బైక్ దూసుకుపోవడంతో, లారీ చక్రాలు వారిపై నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాల పాలైన అంజయ్య, కోటేశ్వరమ్మలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం..
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్చూరు తహశీల్దార్ బ్రహ్మయ్య ప్రయాణిస్తున్న కారు మోపెడ్‌ను ఢీకొట్టిన ఘటనలో.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పసుమర్తి గ్రామ సమీపంలోని నూతన నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి గ్రామానికి చెందిన సుధాకర్ స్థానిక కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్నాడు. శనివారం పని ముగించుకుని తన బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా, పసుమర్తి హైవే వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన తహశీల్దార్ కారు సుధాకర్ వాహనాన్ని ఢీ కొట్టింది. సుధాకర్ టూవీలర్‌ను కారు సుమారు 300 అడుగుల మేర ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. చిలకలూరిపేట పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆనాడు మావిగన్ గుర్తు రాలేదా.. జగన్‌కు కోటంరెడ్డి ప్రశ్న
ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు