అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Nov 08 , 2026 | 09:31 PM
తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ఖమ్మం, నవంబర్ 8: జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై కీలక వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందని చెప్పారు.
గ్రామస్థాయి నాయకుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వివరించారు. ఇప్పటివరకు 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా, మరో 1.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా, పారదర్శకంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నామని, లబ్ధిదారులు నిర్మాణ పనులు ఎంత వేగంగా పూర్తి చేస్తే అంతే వేగంగా నిధులు అందుతాయని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని.. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. పేద కుటుంబాలకు మరింత భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని వివరించారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు