హడావుడి ఏల?
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:19 AM
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధికే మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులు
పోలింగ్ తర్వాతే పార్లమెంటు సమావేశాలను పెట్టాలని లేఖ రాసినా పట్టించుకోలేదు
ఎన్నికల ప్రక్రియ మధ్యలో సమావేశాల నిర్వహణ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే
అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రెండు బిల్లులను పెట్టాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు.. జనగణన తర్వాతే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్
15న ప్రతిపక్ష నాయకులతో ఖర్గే సమావేశం.. బిల్లులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచితే దక్షిణాదికి నష్టమేనని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో లింకు పెట్టడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టాలని, లేకపోతే ‘తీవ్ర పరిణామాలు’ తప్పవని హెచ్చరించింది. ఎన్నికల తర్వాతే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని, అది కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జన గణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన 3 గంటలకుపైగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సచిన్ పైలట్, శశిథరూర్, మీరాకుమార్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, రేవంత్ రెడ్డి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించేందుకు ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులతో మల్లికార్జున్ ఖర్గే ఈనెల 15న సమావేశమవుతారని, పార్లమెంటులోని సభా నాయకులతో సమావేశమై వ్యూహ రచన చేస్తారని సమావేశం నిర్ణయించింది.
పార్లమెంటులో ఆ రెండు బిల్లులను వ్యతిరేకించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని తప్పుబట్టింది. పార్లమెంట్, అసెంబ్లీల్లో సీట్లను 50 శాతం పెంచాలనే నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ప్రశ్నించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తాము అనుకూలమేనని, కానీ, ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టి హడావుడిగా అమలు చేయడాన్నే తప్పుబడుతున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకులు స్పష్టం చేశారు. ఇక్కడ సమస్య మహిళా రిజర్వేషన్ అమలు కాదని, ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచుతున్నామంటూ డీలిమిటేషన్ ప్రక్రియను రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం ద్వారా దక్షిణాదికే కాకుండా ఉత్తరాదికి, ఈశాన్యానికి కూడా నష్టమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ డీలిమిటేషన్ ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమని, ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల కంటే తాము వెనకబడిపోతామని రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య, శశిథరూర్ తదితరులు తప్పుబట్టారు. సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఖర్గే మాట్లాడారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ రెండు సవరణలూ దేశ ఎన్నికల వ్యవస్థపై గణనీయంగా ప్రభావం చూపిస్తాయన్నారు. ప్రతిపక్షాలతో కలిసి, చర్చించి, ఈ విషయంలో ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని ప్రతిపాదించారు.
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాత అంటే ఏప్రిల్ 29వ తేదీ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు తాను, ప్రతిపక్ష నేతలు లేఖ రాశామని ఖర్గే వెల్లడించారు. తామంతా ఉమ్మడిగా విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని, ఎన్నికల్లో ప్రయోజనమే పరమావధిగా సమావేశాల నిర్వహణకే మొగ్గు చూపిందని తప్పుబట్టారు. కాగా రాజ్యాంగంలో ఏయే సవరణలు చేపట్టనున్నారో తమకింత వరకూ సమాచారం లేదని సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో 334ఏ పేరుతో 2023లో ప్రవేశపెట్టిన సవరణ ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లలో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. 2026లో జనగణన పూర్తి చేసి దాని ప్రకారం డీలిమిటేషన్ నిర్వహించాలని, 2029 ఎన్నికల్లో రెండింటినీ అమలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. మరి ఇప్పుడు ఎందుకింత హడావిడిగా 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఎందుకు చూస్తున్నారని నిలదీశారు. వెంటనే మహిళా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని తాము డిమాండ్ చేశామని, అయినా, ప్రభుత్వం తిరస్కరించిందని, జనగణన తర్వాతే అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 334ఏ సవరణను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఇప్పుడు దానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రత్యేక సమావేశాలు హడావిడిగా నిర్ణయించాల్సిన అవసరం ఏమిటి? మరో 20 రోజులు ఎందుకు ఆగకూడదు? జన గణనతోపాటు కుల గణన చేయాలని మేం డిమాండ్ చేశాం. అప్పుడు, మోదీ మమ్మల్ని అర్బన్ నక్సలైట్లుగా అభివర్ణించారు. అదే మోదీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని 2026లో జనగణనలో కులగణన కూడా నిర్వహించాలని నిర్ణయించారు’’ అని చెప్పారు. 2027లోనే జనగణన పూర్తవుతుందని సెన్సస్ కమిషనర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి 15 లక్షల మంది మహిళలకు సాధికారికత కల్పించింది తామేనని గుర్తు చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనం పొందడం, పశ్చిమాసియా ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం, విదేశాంగ నీతిలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది.