14 ఏళ్ల నరకయాతనకు విముక్తి
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:50 AM
హనుమకొండ జిల్లా కమలాపూర్ సిమెంట్ ఇటుకల కేంద్రంలోని నిర్బంధ వెట్టిచాకిరీ ఉదంతంలో బాధిత కుటుంబాలకు సంపూర్ణ విముక్తి లభించింది.
సొంతూళ్లకు కమలాపూర్ బాధితులు
వెట్టిచాకిరీ ఉదంతంపై హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తక్షణ స్పందన
బాధితులను ప్రత్యేక బస్సులో నెల్లూరుకు తరలింపు
యజమాని శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం
హనుమకొండ కలెక్టరేట్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా కమలాపూర్ సిమెంట్ ఇటుకల కేంద్రంలోని నిర్బంధ వెట్టిచాకిరీ ఉదంతంలో బాధిత కుటుంబాలకు సంపూర్ణ విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన 8 దళిత కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుని 14 ఏళ్లుగా అనుభవించిన నరకయాతనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం చూసి అధికార యంత్రాంగం కదిలింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తక్షణమే స్పందించి బాధితులను వారి స్వగ్రామాలకు పంపించారు. ఓ ప్రత్యేక బస్సులో 9 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఇద్దరు బాలకార్మికులు, 8 మంది చిన్నారులను శుక్రవారం రాత్రి స్వగ్రామాలకు పంపించారు. ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా సరిపడా ఆహారం సమకూర్చారు.
అంతకముందు వెట్టిచాకిరీ విడుదల ధ్రువీకరణ పత్రాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. మరోసారి ఎవరి మాయమాటలు నమ్మి మోసపోవద్దని, వెట్టిచాకిరీ పనులకు వెళ్లొద్దని బాధితులకు సూచించారు. అదేవిధంగా బాధితుల సొంత జిల్లా అయిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్ మాట్లాడి పూర్తి వివరాలను వెల్లడించారు. ఇక, అప్పు పేరిట వారానికి కేవలం రూ.600 ఇస్తూ, సిమ్ కార్డులు లాక్కుని, బెల్టులతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఇటుకల కంపెనీ యజమాని ఆర్మూర్ శివకుమార్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కార్మికులు పనిచేసిన దినాలకు చట్టప్రకారం రావాల్సిన పూర్తి వేతన బకాయిలను ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు. కాగా, 14 ఏళ్ల తర్వాత తమ సొంతూరికి వెళుతున్న బాధితులు కలెక్టర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా