తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలపై ఉక్కుపాదం.. కఠిన చట్టానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:54 PM
తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో కఠిన చట్టాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా, కల్తీదారులపై కఠిన చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్, జులై 18: తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో కల్తీల నియంత్రణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కల్తీ ఆహారం, నకిలీ ఔషధాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కల్తీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చేరవేసేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే విజిల్ బ్లోయర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ (TGFADCA) చట్టంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం బిల్లుకు తుది రూపం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
కల్తీల నియంత్రణలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలు, విధానాలను అధ్యయనం చేసి వాటిలో ఉత్తమ పద్ధతులను తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 'క్యూర్' ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ వ్యవస్థను అమలు చేసి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపింది. సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రసాయన అవశేషాలు, కల్తీ కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని సీఎం పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, కల్తీలకు పాల్పడే వారిపై ఇకపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు