యూఎస్ నేవీ జెట్స్ విన్యాసం.. బీచ్‌లో గాల్లోకి ఎగిరిన టెంట్లు, కుర్చీలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:38 AM
అమెరికాలోని ఫ్లోరిడా పెన్సకోలా బీచ్‌లో యూఎస్ నేవీ 'బ్లూ ఏంజెల్స్' రెండు యుద్ధ విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. దీంతో పర్యాటకుల టెంట్లు, కుర్చీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో గల పెన్సకోలా బీచ్‌లో తీవ్ర కలకలం రేగింది. యూఎస్ నేవీకి చెందిన 'బ్లూ ఏంజెల్స్' రెండు యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లడంతో బీచ్‌లోని టెంట్లు, గొడుగులు, కుర్చీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. బుధవారం ఉదయం జరిగిన ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ది బ్లూస్’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో సైనిక విభాగం ఈ ఘటనపై అధికారిక దర్యాప్తునకు ఆదేశించింది.
రెండె సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్స్ తీర ప్రాంతానికి కేవలం కొన్ని అడుగుల ఎత్తులోనే భీకరమైన శబ్దంతో దూసుకెళ్లినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. ఒక జెట్ నుంచి విపరీతమైన గాలి ఒత్తిడి కారణంగా బీచ్‌లో ఉన్న టెంట్లు, కుర్చీలు, ఇతర సామగ్రి ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. ఈ ఊహించని పరిణామానికి అక్కడున్న పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ విమానం సాధారణ స్థాయి కంటే చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించిందని, దీనివల్ల బీచ్‌లోని పౌరుల కుర్చీలు, గొడుగులు ఎగిరిపోయాయని అంటున్నారు. అయితే.. పౌరులు, పైలట్ల భద్రతకే తాము ప్రాధాన్యమిస్తామని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, నావికాదళం, ఎఫ్‌ఏఏ (FAA) భద్రతా ప్రమాణాల ప్రకారం సమగ్ర సమీక్షను నిర్వహిస్తున్నట్లు అధికార బృందం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
సంక్షోభాల వేళా రైతుల సంక్షేమానికి పెద్దపీట
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News