వీధి కుక్కల స్వైరవిహారం.. విద్యార్థి, చిన్నారికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 08:46 AM
వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులపై కుక్కలు దాడి చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో ఈ కుక్కల బెడద ఎక్కువైంది. వివరాలిలా ఉన్నాయి.
సిద్దిపేట: దౌల్తాబాద్ మండలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. బుధవారం వేర్వేరు గ్రామాల్లో జరిగిన దాడుల్లో ఓ విద్యార్థి, మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కోనాపూర్(Konapur)కు చెందిన మైలుగారి చంద్రయ్య కుమారుడు మనోజ్ (12) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాల బస్సు మిస్ అవ్వడంతో మనోజ్ కాలినడకన బయలుదేరాడు. దారిలో కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంటి ముందు ఆడుకుంటుండగా..
గోవిందపూర్‌కు చెందిన ఉప్పల కృష్ణ కుమార్తె అద్విక (3) బుధవారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. చిన్నారిని విచక్షణారహితంగా కరవడంతో తీవ్ర రక్తస్రావమైంది.
ఈ రెండు ఘటనల్లో గాయపడ్డ విద్యార్థిని, చిన్నారిని 108 అంబులెన్స్ సిబ్బంది భానుప్రకాష్, నరసింహులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువైందని, బయటకు రావాలంటేనే జంకుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కుక్కలను షెల్టర్ హోంకు తరలించాలని వేడుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News