Sankranti festival: చలో సొం‘టూర్’.. మొదలైన పండగ ప్రయాణాలు...
ABN , Publish Date - Jan 10 , 2026 | 07:30 AM
సంక్రాతి పండుగకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం రాత్రి నుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే బస్సులు, రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు మూడొందుల మంది తమతమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.
- ఏపీ, యూపీ వైపు రైళ్లు కిటకిట
హైదరాబాద్ సిటీ: పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో పిల్లాపాపలతో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని నాలుగు ప్రధాన రైల్వే టెర్మినల్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వైపు వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. సంక్రాంతి రద్దీని ముందుగానే అంచనా వేసి జనవరి నెలలో మొత్తం 804 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 48 శబరిమల స్పెషల్స్ కాగా, సంక్రాంతి స్పెషల్స్ 162, అన్‌రిజర్వుడ్ స్పెషల్స్ 194, ఇతర ప్రాంతాలకు మరో 400 ప్రత్యేక రైళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

సులభంగా.. సురక్షితంగా
ప్రయాణికులు సులభంగా.. సురక్షితంగా ప్రయాణించేందుకు అన్ని స్థాయిల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేేస్టషన్‌లో అన్‌రిజర్వుడ్ టికెట్ల కోసం వచ్చే ప్రయాణికుల కోసం 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) పూర్తిస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా అన్‌రిజర్వ్డ్ టికెట్లపై 3ు డిస్కౌంట్ ప్రకటించడంతో నగదు రహిత చెల్లింపులు పెరిగాయి.

ప్రత్యామ్నాయ స్టేషన్ల ఎంపిక
సంక్రాంతి రద్దీ మొత్తం సికింద్రాబాద్ స్టేషన్‌పై పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హైటెక్‌సిటీ ేస్టషన్‌లో 16 రైళ్లకు, చర్లపల్లి ేస్టషన్‌లో 11 రైళ్లకు, లింగంపల్లి స్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక స్టాప్‌లు కల్పించారు.
విస్తృతంగా భద్రతా చర్యలు
సికింద్రాబాద్ స్టేషన్‌లో రోజుకు సగటున 2.20 లక్షల మంది, లింగంపల్లి నుంచి 50,000 మంది, చర్లపల్లి నుంచి 35,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్‌లో గ్రౌండ్ ఆపరేషన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద అదనపు సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. స్టేషన్‌లోని సీసీ టీవీ పర్యవేక్షణతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్
Read Latest Telangana News and National News