Share News

Minister Shridhar Babu: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:32 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌ పాలసీలను ఈ నెల 19వ తేదీన దావోస్‌‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో...

Minister Shridhar Babu: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్‌

  • 19న ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌ పాలసీల ఆవిష్కరణ: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌/(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి), జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌ పాలసీలను ఈ నెల 19వ తేదీన దావోస్‌‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆవిష్కరించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్‌ మెడికేర్‌ పైవ్రేట్‌ లిమిటెడ్‌ ఫార్మా యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. దావోస్‌ సదస్సులో ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌ పాలసీలను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. ఫార్మా ఎకో సిస్టమ్‌లో బోస్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, జపాన్‌ తర్వాత హైదరాబాద్‌ 4వ స్థానంలో ఉన్నట్లు సీబీఆర్‌ఈ నివేదికలో వెల్లడించిందని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అప్రూవల్‌ ఉన్న లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు హైదరాబాద్‌లో 200కుపైగా ఉన్నట్లు తెలిపారు. వాస్తవానికి అధునాతన సదుపాయాలు, ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రప్రభుత్వం తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీని సిద్ధం చేసింది. 2030 నాటికి దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, సుమారు 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది.

19 నుంచి 23 వరకు దావోస్‌‌లో సీఎం..

దావోస్‌‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 19 నుంచి 23 వరకు పాల్గొననున్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కీలక సమావేశాల్లో సీఎం పాల్గొననున్నట్టు తెలిసింది. 23న ఆయన అమెరికా వెళ్తారని, 25న రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దావోస్‌‌లో ‘రైజింగ్‌ విజన్‌-2047’

దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్‌ డాక్యుమెంటును ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పెట్టుకున్న లక్ష్యాల గురించి వివరించనున్నట్లు వెల్లడించారు. రైజింగ్‌ 2047 విజన్‌తో పాటు క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ ఫ్రేమ్‌వర్క్‌ గురించి కూడా వివరించనున్నట్లు చెప్పారు. గత రెండు దావోస్‌ పర్యటనలతో పాటు, ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లో వచ్చిన పెట్టబడి ఒప్పందాలు, ప్రణాళికలపై సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో వచ్చిన పెట్టుబడి ఒప్పందాలను మళ్లీ పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, అడ్డంకులను తొలగించి ఫాలోఅప్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jan 10 , 2026 | 05:32 AM