దైవదర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:18 AM
రాష్ట్రంలో మంగళవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం..
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
హైదరాబాద్‌కు చెందిన దంపతుల మృతి
ప్రాణాలతో బయటపడిన వారి కుమారుడు
మరో ఘటనలో వ్యాన్‌ను ఢీకొట్టిన కారు
కొడుకును నేపాల్‌కు సాగనంపి ఇంటికి తిరిగెళ్తూ తల్లిదండ్రుల మృత్యువాత
జహీరాబాద్ సమీపంలో ప్రమాదం
వైరా, జహీరాబాద్ రూరల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటనలో దైవ దర్శనం ముగించుకొని హైదరాబాద్‌లోని ఇంటికి తిరిగి వెళుతున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వారి కారు ముందున్న లారీని ఢీకొట్టగా... కారులోని దంపతులు అక్కడికక్కడే మరణించగా వారి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జహీరాబాద్ సమీపంలో జరిగిన ఘటనలో నేపాల్‌లో వైద్య విద్య చదువుతున్న కొడుకును విమానం ఎక్కించి ఇంటికి తిరుగు ప్రయాణమైన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మంగళవారం ఉదయం ఎనిమిది గంటలప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ ప్రాంతానికి చెందిన కోట్ల కిషోర్‌రెడ్డి(53), లావణ్య(48) దంపతులు మరణించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన కోట్ల కిషోర్‌రెడ్డి తన భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. కిషోర్ రెడ్డి గ్లోబల్ అగ్రీస్ సోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూ ఇతర వ్యాపారులు కూడా చేస్తున్నారు. ప్రణీత్ రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థి. కిషోర్ రెడ్డి కుటుంబం ప్రతీ ఏటా కార్తిక పౌర్ణమికి అన్నవరం వెళ్లివస్తోంది.
ఇదే క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి రాత్రి అన్నవరం చేరుకుంది. సోమవారం ఆలయంలో పూజలు చేసుకున్న ఆ కుటుంబం.. కార్తిక పౌర్ణమి అయిన మంగళవారం వేకువజామున పూజలు ముగించుకొని తిరుగు ప్రయాణమైంది. ప్రణీత్ రెడ్డి కారు నడుపుతుండగా అతని పక్కసీటులో తల్లి లావణ్య, కారు వెనక సీటులో కిషోర్ రెడ్డి ఉన్నారు. అయితే, వైరాకు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్-4(సోమవరం) అండర్ పాస్ హైలెవల్ వంతెన సమీపంలో వైజాగ్ నుంచి ముంబైకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారు ఎడమవైపు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద తీవ్రతకు లావణ్య, కిషోర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రణీత్ రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారులో ఇరుక్కుపోయిన ప్రణీత్ రెడ్డిని స్థానికులు బయటకు తీశారు. కిషోర్ రెడ్డి, లావణ్య మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వైరా ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదే తుది వీడ్కోలైంది...
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని హైవే 65 బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ఉమర్గా ప్రాంతం మురుము గ్రామానికి చెందిన శరణప్ప(55), సుష్మ (51) దంపతులు మరణించారు. శరణప్ప దంపతులు కుమారుడు నేపాల్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. సెలవులకు ఇంటికొచ్చిన కుమారుడు తిరిగి నేపాల్ బయలుదేరగా తల్లిదండ్రులు శంషాబాబ్ విమానాశ్రయానికి వెళ్లి సాగనంపారు. అనంతరం ఇంటికి తిరిగొస్తుండగా అల్గోల్ చౌరస్తా వద్ద హైవే బైపా్‌సపై నిలిపిన కోళ్ల వ్యాన్‌ను వారి కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుమారుడికి వారు చెప్పిన వీడ్కోలే తుదివీడ్కోలు అయింది. మృతదేహాలను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మారిషస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..
సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ