Share News

అనుమానం పెను విషాదమై..

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:36 AM

అనుమానం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. భార్యాభర్తల మధ్య గొడవలకు అభం శుభం తెలియని వారి ముగ్గురు చిన్నారులు బలయ్యారు.

అనుమానం పెను విషాదమై..

  • కుటుంబ కలహాలకు ముగ్గురు పసికందుల బలి

  • భర్తపై అక్రమ సంబంధం అనుమానం

  • పిల్లలతో కలిసి నీటి సంపులోకి దూకిన తల్లి

  • కవలలతో పాటు రెండేళ్ల చిన్నారి మృతి

  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఘటన

షాద్‌నగర్‌/ కేశంపేట నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అనుమానం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. భార్యాభర్తల మధ్య గొడవలకు అభం శుభం తెలియని వారి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. భర్తపై అనుమానంతో ఆ కోపాన్ని ఓ భార్య తన కన్న బిడ్డలపై చూపించిన అమానుష చర్యకు 8 నెలల కవల పసి కందులతో పాటు, రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తొమ్మిదిరేకులకు చెందిన కందెన చెన్నయ్య, శ్రీవర్షకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల ప్రియతో పాటు, 8 నెలల క్రితం జన్మించిన మరో ఇద్దరు కవల పిల్లలు ప్రీతి, ప్రిన్సీ ఉన్నారు.


ఇటీవల చెన్నయ్య రాత్రివేళలో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాతుండటం భార్యభర్తల మధ్య గొడవలకు దారితీసింది. భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే అర్ధరాత్రి వరకు ఫోన్‌లో మాట్లాడుతున్నాడని అనుమానం పెంచుకున్న భార్య శ్రీవర్ష.. శుక్రవారం రాత్రి గొడవ పడింది. శనివారం ఉదయం కూడా ఇద్దరూ గొడవ పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె.. మొదట తన కవల పిల్లలను ఇంట్లో ఉన్న నీటి సంపులోకి పడేసింది. తర్వాత తన రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని తాను కూడా అందులోకి దూకింది. సంపులో నీరు తక్కువగా ఉండటంతో తల్లి శ్రీవర్ష ప్రాణాలతో బయట పడగా, తన ముగ్గురు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు.


తమ ఇద్దరి మధ్య కేవలం ఫోన్‌ విషయంపైనే గొడవలు జరుగుతున్నాయని భర్త కందెన చెన్నయ్య తెలిపాడు. తనకు కొంత అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చేందుకే ఫోన్‌లో మాట్లాడుతుంటానని పేర్కొన్నాడు. అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేని కానీ తన భార్య ఇంత దారుణానికి ఒడిగడుతుందని తాను ఎన్నడూ అనుకోలేదని చెప్పాడు. వారిపై కేసు నమోదు చేసినట్లు కేశంపేట సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 01:39 AM