సాయి తేజ మృతి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు..
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:38 PM
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా నారపల్లిలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జాదవ్ సాయి తేజ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. విద్యార్థి మృతి ఘటనపై నివేదిక పంపకపోవడాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా: నారపల్లిలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జాదవ్ సాయి తేజ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. విద్యార్థి మృతి ఘటనపై నివేదిక పంపకపోవడాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమెకు నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 28న ఢిల్లీలోని మానవ్ అధికార్ భవన్‌లో కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని తెలిపింది.
కాగా, సాయి తేజ మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీని న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్ కల్యాణ్ ఆశ్రయించారు. సీనియర్ విద్యార్థులు తీవ్రంగా ర్యాగింగ్ చేసి వేధింపులకు గురిచేశారని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సాయి తేజ సెల్ఫీ వీడియోను కూడా కమిషన్‌కు అందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని ఫిర్యాదుదారు కమిషన్‌ని కోరారు.
సాయి తేజ మృతి ఘటనలో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో యాంటీ-ర్యాగింగ్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం.. పోలీసులకు ఫిర్యాదు
‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్