Share News

ప్రపంచస్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:58 PM

ప్రపంచ స్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏరోస్పేస్ గ్లోబల్ సప్లై చైన్‌లో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌కు గుర్తింపు తెస్తామని తెలిపారు.

ప్రపంచస్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి, నవంబర్ 17: ప్రపంచ స్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏరోస్పేస్ గ్లోబల్ సప్లై చైన్‌లో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌కు గుర్తింపు తెస్తామని తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు తిగాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన జేఈహెచ్ ఏరోస్పేస్ సంస్థతోపాటు టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణలో ఏరోస్పేస్ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో విమాన విడిభాగాల తయారీ, మరమ్మతులకు అవసరమైన అధునాతన టూల్స్ అందుబాటులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.


JEH-Tooling-Center.jpg

విమానాలు, విమాన ఇంజిన్ల తయారీ, నిర్వహణకు ప్రత్యేక పరికరాలు తయారవుతాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడుతున్న టూలింగ్ అవసరాలకు ఇకపై స్థానికంగానే తయారవుతాయని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రెసిషన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. గ్లోబల్ కంపెనీలతో స్థానిక ఎంఎస్ఎంఈల అనుసంధానానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, రక్షణ రంగాలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు అమలు చేస్తోందని మంత్రి శ్రీదర్ బాబు వివరించారు.


Sridharbabu.jpg

షాద్‌నగర్ పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

తిగాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏరోస్పేస్ టూలింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోంగా ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్‌నగర్ పారిశ్రామిక ప్రగతిలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విమానాలు, ఏరో ఇంజిన్ల తయారీ, నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు, ఫిక్చర్లను ఈ కేంద్రంలో తయారు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు దిగుమతులపై ఆధారపడిన ఈ రంగంలో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


sridharbabu4.jpg

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, తెలంగాణలో ఆధునిక పరిశ్రమల అభివృద్ధికి ఇలాంటి సంస్థలు తోడ్పడతాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. షాద్‌నగర్ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో సంస్థను ఏర్పాటు చేసినందుకు జేఈహెచ్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధుల బృందానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూర్ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, అంబటి ప్రభాకర్, సాయిలు, కొర్ర రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం.. ఖరీదైన మద్యం బాటిల్స్‌లో చీప్ లిక్కర్ విక్రయాలు

అధిక ధరలకు బియ్యం విక్రయాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 03:52 PM