ఎంత అడ్డుకోవాలని చూసినా ఆగదు.. ఇది దైవ కార్యం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:22 PM
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి వద్ద ఆధునిక గోశాలకూ ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబసమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
రంగారెడ్డి: రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడం సరికాదని, ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా ఈ ప్రాజెక్టు ఆగదని తేల్చి చెప్పారు. ఇవాళ(శనివారం) రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి వద్ద ఆధునిక గోశాలకూ ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబసమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఇదేం సంస్కృతి..?
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..'మంచిరేవుల ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతాం. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడం ఏ సంస్కృతి?. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక. మూసీ పరీవాహకంలో చారిత్రక శివాలయాన్ని పునఃనిర్మించాలని ఈశ్వరుని ఆశీర్వాదంతో పనులు మొదలుపెట్టాం. దీనిపై పెడార్థాలు తీసి విమర్శించే వారిపై ప్రజలే శివతాండవం చేస్తారు. ఆరు నూరైనా ఈ ప్రాజెక్టు ఆగదు.. ఇది శివదీక్ష. రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతాం. ఇది ఓట్ల కోసం.. నోట్ల కోసం చేస్తున్న పని కాదు. ఇది చరిత్రలో దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం.. ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి. ప్రజలే మాకు దేవుళ్లు. వారి ఆకాంక్షల మేరకే చేస్తున్నాం. చరిత్రాత్మక మందిరాన్ని నిర్మించుకోవడం ఒక చారిత్రక సందర్భం. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ పని జరుగుతోందని అనుకోవట్లేదు.
అడ్డంకులు వచ్చినా తగ్గేది లేదు..
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం. 8 ఎకరాల్లో రూ.700కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన. మూసీ నది పునరుజ్జీవనం చేయాలని చాలా మంది ప్రయత్నించారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడు. తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి జరిగింది. మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా మనం ఉపయోగించుకోలేదు. మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది.
ఢిల్లీలా హైదరాబాద్‌ను కానివ్వం..
హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించింది. అలాంటి నగరాల నుంచి మనం నేచుకోవాల్సిన అవసరం ఉంది. మూసీ పరీవాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా మసీదు, చర్చిని నిర్మించబోతున్నాం. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజల కష్టాలు చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములు. మానవ తప్పిదాలను సరిదిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మూసీ పరీవాహక ప్రజాప్రతినిధులు నదీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు.
కేసు వెనక్కి తీసుకోవాల్సిందే..
కానీ తాము చేయలేనిది ఎవరూ చేయొద్దనే అక్కసుతో కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో పదవులు అనుభవించిన మా అక్క కుమారుడు.. అభివృద్ధిని అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా?. మా అక్కకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. నీ పుత్ర రత్నం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారు. మీ వెనక ముసుగు తొడుక్కున్న వారికీ చెబుతున్నా ఇలాగే వ్యవహరిస్తే ఇప్పుడున్న స్థానం కూడా వారికి ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి
కాలేశ్వరం పాపం కేసీఆర్‌దే: కేంద్ర మంత్రి బండి సంజయ్
చెన్నై నగరానికి కృష్ణా జలాల నిలిపివేత