Telangana High Court: ఎందుకు ప్రతిసారి టికెట్ల ధరలు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:21 PM
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతించారని, రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ సమయంలో టికెట్ల ధరలు పెంచడం సర్వసాధారణం అయ్యింది. అలాంటి సందర్భాల్లో రేట్ల పెంపకం వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంటుంది. తాజాగా అలాంటిదే యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీకి ఎదురైంది. ఈ మూవీ టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. అయితే రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ చేపట్టింది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారన్న న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై విచారణ చేసింది హైకోర్టు.
టికెట్ పెంపు విషయంలో హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని కోర్టు దృష్టికి విజయ్ గోపాల్ తెచ్చారు. జిల్లా స్థాయి కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు టికెట్ల ధరల పెంపు మోమోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద సినిమాల సమయంలో తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని జీపీని ప్రశ్నించింది.
'ఇటీవల టికెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించారు. అయినా పదే పదే టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారు. టికెట్ రేట్ల మెమో గురించి విచారణ జరగటం ఇది మొదటిసారి కాదు.. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన తీరు మారడం లేదు. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మొత్తం ఒకే టికెట్ ధర ఉండేది, కానీ ఇప్పుడు ప్రతిసారి టికెట్ ధరలు పెంచుతూ పోతున్నారు. దీనికి వల్ల సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మేము కూడా సినిమాలకు వెళ్లాం.. మాకూ టికెట్ ధరలు తెలుసు' అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ అనంతరం 'రాజా సాబ్' సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేసింది. పాత రేట్లకే వసూలు చేయాలని ఆదేశించింది. జీవో నంబర్ 120 ప్రకారం 350 లోపే సినిమా టికెట్ ఉండాలని స్పష్టం చేసింది. ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచుతూ మెమోలు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News