Telugu Student Missing: అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:07 PM
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయారు. గుంటూరుకు చెందిన హరి కృష్ణా రెడ్డి ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు..
అలాస్కా, జనవరి 9: గుంటూరుకు చెందిన హరి కృష్ణారెడ్డి కరసాని అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కృష్ణారెడ్డి హ్యూస్టన్‌లో ఉంటున్నారు. క్రిస్మస్ సెలవులు రావడంతో అలాస్కాకు వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 22, 2025న ఒంటరిగానే హరి అలాస్కా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డెనాలి సమీపంలోని ఓ హోటల్‌లో బస చేశారు. తాను అలాస్కా పర్యటనకు వెళ్తున్నానని.. జనవరి 3 లేదా 4న తిరిగి వస్తానని తన రూమ్మేట్స్‌కు చెప్పారు. ఒంటరిగా అలాస్కా వెళ్లిన తెలుగు విద్యార్థి.. డిసెంబర్ 30న తన స్నేహితులతో చివరిసారిగా మాట్లాడారు. డిసెంబర్ 31 నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31నే హరి హోటల్ నుంచి చెక్ అవుట్ అయినట్లు సమాచారం.
క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లినట్టు?
హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఎక్కడి వెళ్లినా క్యాబ్ సర్వీస్‌ను ఉపయోగిస్తుంటారు. లేదా స్థానిక రవాణాపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో డిసెంబర్ 31న హోటల్ నుంచి బయటకు వచ్చిన హరి.. క్యాబ్ సర్వీస్ వాడినట్లు తెలుస్తోంది. దీంతో హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు?.. క్యాబ్ డ్రైవర్ ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో హరి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు కూడా కీలకంగా మారాయి.
కుటుంబ సభ్యుల ఆవేదన..
వారం రోజులుగా హరి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. హరి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఫోన్ కలవకపోవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివిటీ ఆగిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని స్థానిక పోలీసులు, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు.. హరి కోసం గాలిస్తున్నారు. ‘ఒకవైపు తీవ్రమైన మంచు తుఫాన్, మరోవైపు మైనస్ 40 డిగ్రీల చలి.. ఈ పరిస్థితుల్లో హరి క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాస్కాలో మైనస్ 40 డిగ్రీల చలి..
ఇక.. అలాస్కాలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోయాయి. ఇలాంటి వాతావరణంలో కొన్ని నిమిషాల పాటు బయట ఉన్నా శరీరం గడ్డకట్టడం, హైపోథెర్మియా వంటి ప్రాణాంతక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా అలాంటి ప్రదేశంలో సరైన నెట్‌వర్క్ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ప్రయాణిస్తే సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక ఇతరుల సహాయం కోరడం కూడా కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది.
విదేశాల్లోని విద్యార్థులకు హెచ్చరిక..
హరి అదృశ్య ఘటన విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఒక హెచ్చరికగా మారింది. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు, ఒంటరి ప్రయాణాలు చేయవద్దని, ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు లోకేషన్లు షేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు కేంద్రం నయా ప్లాన్..
Read Latest NRI News And Telugu News