Share News

తెలంగాణలో పోటీ చేస్తాం

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:30 AM

తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.

తెలంగాణలో పోటీ చేస్తాం

  • జీహెచ్‌ఎంసీతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ..

  • తెలంగాణలో పర్యటిస్తా.. ప్రజా సమస్యలపై మాట్లాడతా

  • నన్ను అడుగు పెట్టనివ్వబోమనే బెదిరింపులకు భయపడను

  • ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం

  • ఇది భారతదేశమా లేక పాలస్తీనానా!?.. పాకిస్థానా!?

  • ఇలాంటి వాతావరణం దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది

  • బీఆర్‌ఎస్‌ అధినేత మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో పర్యటించవచ్చు

  • రాహుల్‌, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పోటీచేయొచ్చు

  • పవన్‌ కల్యాణ్‌ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా!?

  • కొన్ని పార్టీలు, సోషల్‌ మీడియా ముసుగులో విద్వేషం

  • నేను చెరువును కబ్జా చేశానని నిర్ధారిస్తే సర్కార్‌కు రాసిస్తా

  • తెలంగాణ, ఏపీని కలిపే హైవేకు బూర్గుల పేరు పెట్టాలి

  • జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్ర జ్యోతి): ‘‘తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది. పొత్తులతో వెళతామా.. ఒంటరిగా పోటీ చేస్తామా!? అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎవరు కలిసొచ్చినా రాకున్నా.. ప్రజల కోసం పోరాడతాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్నీ ప్రశ్నిస్తాం’’ అని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. పదే పదే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం దేశ సమైక్యతకు మంచిది కాదని, ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని అభివర్ణించారు. వేర్పాటు వాదం మంచిది కాదని.. ఇది భారత దేశమా.. లేక పాలస్థీనా.. పాకిస్థానా అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని చేసే బెదిరింపులకు జనసేన భయపడదన్నారు. ‘తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా!?’ అని ప్రశ్నించారు. తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనని అన్నారు. ఇవాళ ఎవరో వచ్చి బెదిరించే పరిస్థితి రాకూడదని, దశాబ్దానికిపైగా భరించామని, ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రాష్ట్రాల్లో వేర్పాటు వాదంతో ఇలాగే మాట్లాడితే.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకుని పోవాలా!? ఇలాంటి వాతావరణం దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది.


ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. మేమూ పన్నులు కడుతున్నాం. ప్రాంతీయత పేరుతో జాతీయ వాదాన్ని బలహీనపరిస్తే.. జనసేన కొట్లాడుతుంది. తమిళనాడులో హిందీ గో బ్యాక్‌, తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్‌ అనే నినాదాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇలాంటి సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తెలంగాణ నడిబొడ్డునే పుట్టిందన్నారు. జనసేనకు తెలంగాణ మీద ప్రేమ ఇవాళ తెచ్చుకున్నది కాదని.. 2007, 2008 నుంచే ఉందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాకముందే.. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు, పోరాట స్ఫూర్తికి ఉత్తేజితమై.. సినిమాల్లోనూ ముందు కు తీసుకెళ్లానని చెప్పారు. ‘‘ఇవాళ నన్ను విమర్శించే గొంతులు.. 2007లో ఎక్కడికి పోయాయి!? తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినే తప్ప.. అధికార వ్యామోహం లేదు. మాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు. నేనేమన్నా తెలంగాణలో సీఎం అవుతానా!? పదవుల కోసమే అయితే 2008లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినా తీసుకోలేదు. ప్రజా సమస్యల మీద ఆదిలాబాద్‌ మారుమూల ప్రాంతాలతోపాటు నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లోనూ పర్యటించాను. ఇవాళ పదవుల్లో ఉన్నవారు ఎవరూ ఆ ప్రాంతాల్లో తిరగలేదు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందకపోతే బోర్లు వేసి దాహం తీర్చాం’’ అని చెప్పా రు.

జనసేన అడుగు పెట్టవద్దంటే ఎలా..!?

ఇవాళ చాలామంది బెదిరిస్తున్నారని, ఎవరో బెదిరిస్తే.. జన సేన భయపడదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే ఏపీలోనే తనకు ఎక్కువ బెదిరింపులు ఉన్నాయన్నారు. ఇవాళ తనను బెదిరించే వాళ్లకు తన ఇంటి చిరునామా చెప్పేందుకే ఇంటి వద్ద విలేకరుల సమావేశం పెట్టానన్నారు. తొలిసారి తనపై తెలంగాణలోనే పోలీసు కేసు నమోదైందని, తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదని స్పష్టం చేశారు. బాంచెన్‌ కాల్మొక్తా అనే స్వభావం తనకు లేదని, ఉంటే పార్టీ పెట్టేవాడిని కాదన్నారు. మాట్లాడకుండా వదిలేస్తే.. ఇళ్లలోకి దూరి ప్రైవేటు ఆస్తుల జోలికి వస్తారనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ‘‘జర్నలిస్టులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులు అన్ని మతాలు, ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. ఇలాంటి విద్వేష పూరి త వాతావారణం ఉంటే ఏపీ, తెలంగాణలో అఖిల భారత సర్వీసు అధికారులు పని చేయగలరా!? కేసీఆర్‌ తన పార్టీని ఏపీలో పెడితే స్వాగతించాం. బీఆర్‌ఎస్‌ ఆఫీసు గుంటూరులో పెట్టుకున్నారు. జనసేన నుంచి వెళ్లిన నాయకుడిని అధ్యక్షుడిని చేశారు.


బీఆర్‌ఎస్‌ అధినేత మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో పర్యటించవచ్చు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా!? జనసేనను తెలంగాణలో అడుగుపెట్టవద్దంటే ఎలా!?’’ అని నిలదీశారు. తెలంగాణలో ఆంధ్రావారికి ఏం పని అని ప్రశ్నించేవారికి.. ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లు, తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు చేస్తు న్న వ్యవహారాలు కనిపించడం లేదా!? అని నిలదీశారు. వ్యాపారాలు, పాలకుల అధికారాలు బాగానే ఉన్నాయని, ఏదన్నా మాట్లాడితే తనలాంటి వారినే లక్ష్యం చేసుకుంటారని తప్పుబట్టారు. మాట్లాడితే.. ఆంధ్రా, ఆంధ్రా అంటున్నారని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రా ప్రజల మీద ఎలాంటి ద్వేషం లేకపోయినా.. కొంతమంది కొన్ని పార్టీల ముసుగులో, సామాజిక మాధ్యమాల వెనుక, పార్టీల జెండాల వెను క ఉండి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రా నేతలను తెలంగాణ నాయకులు ఎన్నోసార్లు.. ‘నా కొడకల్లారా..’ అని తిట్టారని.. అక్కడి అన్ని వర్గాల ప్రజలను తిట్టినట్లే కదా అని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమ లేకపోతే ఇక్కడ ఎవరూ ఉండలేరని.. పనులు చేసుకోలేరని చెప్పారు. పీకలు తెగినా ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. నాడు తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం వ్యతిరేకించాయని.. వారిని మాత్రం ఎవరూ ఏమీ అనడం లేదని తప్పుబట్టారు.

కష్టాల్లో నాకు అండగా తెలంగాణ

‘‘తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. తలుపులు మూసి నాడు రాష్ట్ర విభజన చేసిన తీరునే తప్పు పట్టాను. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు జనసేన వ్యతిరేకం కాదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచింది తెలంగాణ ప్రజలే. తెలంగాణ, ఏపీలో నాటి పాలకులు తిరగనివ్వబోమని అంటే.. వారాహికి తెలంగాణ ప్రజలు ముందుండి స్వాగతం పలికారు. పవన్‌ను ఏపీలో అడుగు పెట్టనివ్వబోమని వైసీపీ అంటే.. కోదాడ, నల్ల గొండ యువత అండగా నిలిచారు’’ అని వివరించారు. జనసేన ఏడు సిద్ధాంతాలు తెలంగాణ సామాజిక వాస్తవాల నుంచే పుట్టాయన్నారు. ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేద్దామని తమ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పినా.. మార్పు కోసం పని చేయాలని, అధికారం కోసం కాదని చెప్పానని తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై తిరుగుతామన్నారు.


రేవంత్‌ అంటే గౌరవం.. కానీ..

రేవంత్‌ రెడ్డి అంటే తనకు గౌరవమని, కానీ, తాను చెరువును కబ్జా చేసినట్లు ప్రభుత్వం నిర్ధారిస్తే.. ఆ భూమిని ప్రభుత్వానికే రాసిస్తానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2000 మందితో తాను సభ పెట్టుకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతాయని చెప్పడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తాయా!? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఐక్యతకు బూర్గుల రామకృష్ణారావు చిహ్నమని, తెలంగాణ, ఏపీని కలిపే హైవేకి ఆయన పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

పదవుల్లో తెలంగాణ వ్యతిరేకులు

‘‘తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇవాళ పదవుల్లో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు ఎలా వస్తారో చూస్తామని ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు.. వైఎస్‌ తెలంగాణను వ్యతిరేకించిన రోజు ఆయన పక్కనే ఉన్నారు. ఆరోజు వారి నోరు ఎందుకు లేవలేదు!? అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులను ఓయూ విద్యార్థులు, బస్తీ ప్రజలే తన్ని తరిమేశారు. తనపై దాడికి వస్తామంటే.. ఇంటి ముందే కుర్చీ వేసుకుని కూర్చున్నా’’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకులు ఏమనుకుంటున్నారో అర్థం కాదని, రాహుల్‌, ప్రియాంకా గాంధీ కేరళ, వయనాడ్‌లో పోటీ చేయవచ్చని, ఇందిరా గాంధీ మెదక్‌ నుంచి పోటీ చేయవచ్చని, తన విషయంలో ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జనసేనను ఇక్కడ వ్యతిరేకిస్తే.. ఉత్తరాదిలో పుట్టిన కాంగ్రెస్‌కు ఇక్కడ ఏం పని అనే వాదన కూడా వస్తుందన్నారు. పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడని అక్కున చేర్చుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించామని గుర్తు చేశారు.


ఎంతకాలం రెచ్చగొడతారు!?

‘‘తెలంగాణలో ఉపాధి లేకపోయినా, పరిశ్రమలు రాకపోయినా ఆంధ్రావాడే కారణమా!? ఎంత కాలం ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు!? ఏ సమస్య ఉన్నా దానికి ఆంధ్రావాడు.. పవన్‌ కారణమనడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి వాతావరణం ఉంటే మర్రి చెన్నారెడ్డి కాలంలో మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడికి వచ్చేదా!? పాలకులు వేరు.. ప్రజలు వేరు. అన్యా యం చేసిన పాలకులను ఉరి తియ్యాలి. తప్పు చేసే పాలకులను ప్రశ్నించకుండా విద్వేషాలు రెచ్చగొడి తే.. దేశం ఎటుపోతుంది? సూరత్‌లో తెలుగువారు ఉన్నారు. నాందేడ్‌లో ఉన్న తెలుగు వారిని అక్కడి వారు విద్వేషంతో తరిమిస్తే.. దేశ సమైక్యత దెబ్బతినదా!?’’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. విశ్లేషకుడిని విమర్శిస్తే అందులో ప్రాంతీయ విద్వేషం ఎక్కడుందని ప్రశ్నించారు. ‘‘అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది!? ఒక విశ్లేషకుడు కుట్రపూరితంగా తన విశ్లేషణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రస్తావన తేవడం వల్ల. అమిత్‌ షా ప్రస్తావన తేవడం వల్లే మాట్లాడాను. తప్ప.. తెలంగాణపై నాకు ఎ లాంటి వ్యతిరేక భావన లేదు. ఆ విశ్లేషకుడు చెప్పిన విషయం కరెక్టు కాదని మాత్రమే ఖండించాను. జన సైనికులు కేసులు పెట్టిన విషయం నాకు తెలియదు. నా దృష్టికి వస్తే వదిలేయమని చెప్పాను’’ అని వివరించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని ఒకప్పుడు పిలుపునిచ్చిన వామపక్షాలు ఇప్పుడు ప్రాంతీయతను రెచ్చగొట్టే స్థితికి చేరుకున్నాయని, వామపక్ష భావజాలం, వామపక్ష సానుభూతిపరుల ముసుగులో కొందరు విశ్లేషకుల వ్యక్తిగత ప్రాంతీయతా సిద్ధాంతాల వల్లేనే దేశంలో కమ్యూనిజం చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. గద్దర్‌ బతికి ఉన్నప్పుడు ఆయనను పట్టించుకోని వామపక్ష మేధావులు ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. జనసేన కార్యాలయానికి వచ్చిన గద్దర్‌.. తన వంట్లో బుల్లెట్లు ఉన్నాయని.. నడవలేకపోతున్నానని అంటే.. 24 గంటల్లో కారు కొనిచ్చానని గుర్తు చేశారు. తన సొంత నిధులతో ఏపీలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. తెలంగాణపై తనకు వ్యతిరేకత ఉంటే కొండగట్టు అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.30 కోట్లు ఎందుకు మంజూరు చేయిస్తానన్నారు. ఆపద సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి ఎందుకు విరాళం ఇస్తానని ఆయన అన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 05:30 AM